Site icon NTV Telugu

Producer KS Ramarao: ఆ వార్త‌లో నిజం లేదు

ks ramarao

ks ramarao

ఆంధ్రప్ర‌దేశ్ విభ‌జ‌న త‌రువాత న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందాల‌ని అప్ప‌టి ప్ర‌భుత్వం, సినిమా పెద్ద‌లు భావించారు. అందుకు విశాఖ ప‌ట్ట‌ణాన్ని కేంద్రంగానూ ఎంచుకున్నారు. అప్ప‌టికే అక్క‌డ డి.రామానాయుడు ఫిలిమ్ స్టూడియోస్ నిర్మించారు. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ కూడా ఓ ఫిలిమ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్ అవ‌స‌ర‌మ‌ని భావించారు. విశాఖ ఫిలిమ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ను అక్క‌డి ఔత్సాహికుల‌ను ప్రోత్స‌హించ‌డానికి స్థాపించ‌డం జ‌రిగింది. ఆ క్ల‌బ్ కు అధ్య‌క్షునిగా ప్ర‌ముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నియ‌మితుల‌య్యారు. గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా ఆయ‌నే ఆ ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు. అయితే బుధ‌వారం (మార్చి 16న‌) ఓ దిన ప‌త్రిక‌లో విశాఖ‌ప‌ట్ట‌ణం ఫిలిమ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్ ప్ర‌స్తుత క‌మిటీని ర‌ద్దు చేసి, వైసీపీకి స‌న్నిహితులైన ముగ్గురు పెద్ద‌లు ఆక్ర‌మించార‌న్న వార్త వెలువ‌డింది. ఈ ప‌రిణామంలోనే కె.ఎస్.రామారావును సైతం అధ్య‌క్ష ప‌ద‌వి నుండి తొల‌గించార‌ని ఆ వార్త‌లో పేర్కొన్నారు. క్ల‌బ్ కు సంబంధించిన రూ.30 కోట్ల‌ను చేజిక్కించుకొనేందుకే ఈ ప‌న్నాగం ప‌న్నార‌నీ అన్నారు. ఈ విష‌యాల్లో ఏ లాంటి వాస్త‌వం లేద‌ని కె.ఎస్.రామారావు హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తెలిపారు.

ఎవ‌రో గిట్ట‌ని వారు తెలిపిన వివ‌రాల‌ను వార్త‌లుగా ప్ర‌చురించ‌డం స‌బ‌బు కాద‌ని, ఇప్ప‌టికీ తానే ప్రెసిడెంట్ గా ఉన్న కార‌ణంగా అస‌లు విష‌యాలు అడిగి ఉంటే బాగుండేద‌ని కె.ఎస్.రామారావు అభిప్రాయ‌ప‌డ్డారు. అస‌లు వైజాగ్ లో ఫిలిమ్ క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్ ఎలా ఏర్పాట‌యిందో అయ‌న వివ‌రించారు. తొలుత తొట్లకొండ అనే ప్ర‌దేశంలో అక్క‌డి ఎఫ్.ఎన్.సి.సి.కి శంకుస్థాప‌న కూడా జ‌రిగిందని చెప్పారు. అయితే అది బౌద్ధ ఆరామ ప‌ర్యాట‌క ప్ర‌దేశం కావ‌డంతో బౌద్ధులు అభ్యంతరం తెలిపారని, దాంతో అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వేరే ప్ర‌దేశంలో రామానాయుడు స్టూడియోస్ కు ద‌గ్గ‌ర‌గా ఐదు ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించారని వివ‌రించారు. ఈ రెండు సైట్స్ ఇప్ప‌టికీ విశాఖ ప‌ట్ట‌ణం ఫిలిమ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ పేరునే ఉన్నాయ‌ని రామారావు తెలిపారు. అయితే అవి నిర్మాణానికి అనువుగా ఇంకా మంజూరు కాలేదని, దాంతో ఓ మిత్రుడు బీచ్ కుస‌మీపంలోని త‌న స్థ‌లంలో క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్ కు అనుమ‌తినిచ్చారని అన్నారు. అక్క‌డే ప్ర‌స్తుతం విశాఖ ప‌ట్ట‌ణం ఫిలిమ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్ కొన‌సాగుతోంద‌ని ఆయ‌న చెప్పారు.

నిజానికి త‌న వ‌య‌సు రీత్యా, త‌న ప‌ద‌వికి స‌రైన న్యాయంచేయ‌లేక‌పోతున్న దృష్ట్యా తానే ఆ ప‌ద‌వి నుండి తొల‌గాల‌ని చాలారోజులుగా భావిస్తున్నాన‌ని, అయితే, అక్క‌డి మిత్రులు అందుకు అంగీక‌రించ‌కుండా త‌న‌నే ప‌ద‌విలో కొన‌సాగిస్తున్నార‌ని ఆయ‌న వివ‌రించారు. క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ అంటేనే కుల‌మ‌త ప్రాంత భేదాల‌కు, రాజ‌కీయాల‌కు అతీతంగా ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఇలా నిరాధార‌మైన వార్త‌ల‌ను ప్ర‌చురించ‌డం వ‌ల్ల త‌మ ప‌రిశ్ర‌మ‌పై చుల‌క‌న భావం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. అక్క‌డ లోక‌ల్ గా ఉన్న‌వారు కొంద‌రు త‌మ‌కు తోచింది చెప్ప‌డం, దానిని ప్ర‌చురించ‌డం త‌ద్వారా గంద‌ర‌గోళం నెల‌కొనేలా చేయ‌డం స‌బ‌బు కాద‌ని ఆయ‌న అన్నారు.

వాస్త‌వానికి ఆ క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్ గురించి మంత్రి పేర్ని నానితో చ‌ర్చించామ‌ని, అందుకు వారు కూడా సానుకూలంగా స్పందించార‌ని రామారావు చెప్పారు. ప్ర‌భుత్వాలు ప్ర‌జాపాల‌న‌లో త‌ల‌మున‌క‌లై ఉంటాయ‌ని, అందువ‌ల్ల సినిమా క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్ పై దృష్టి సారించ‌డంలో జాప్యం జ‌ర‌గ‌వ‌చ్చ‌ని, అంత మాత్రాన ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌న‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. అందులో ఉన్న సొమ్మును తీసుకోవ‌డం కూడా అంత సులువు కాద‌ని ఆయ‌న తెలిపారు. ఇక కల్చ‌ర‌ల్ క్ల‌బ్ లో అన్ని పార్టీల‌కు చెందిన‌వారు, అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారు ఉన్నార‌ని, తామంతా ఎంతో స్నేహంగా ఉంటామ‌ని ఆయ‌న వివ‌రించారు. ఇక‌పై ఎవ‌రు వార్త‌లు రాయాల‌న్నా స్ప‌ష్ట‌త కోసం సంబంధించిన వారిని అడిగి మ‌రీ వార్త‌లు రాయాల‌ని ఆయ‌న సూచించారు. మొత్తానికి ఆ వార్త‌లో నూటికి రెండువంద‌ల శాతం వాస్త‌వం లేద‌ని ఆయ‌న అన్నారు. ఏపీ ప్ర‌భుత్వం టిక్కెట్ల రేట్లు త‌గ్గించినా, త‌రువాత ప‌రిశ్ర‌మ విన‌తి మేర‌కు స‌వ‌రించింద‌ని, భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు త‌గిన విధంగా టిక్కెట్ రేట్ల‌ను నిర్ణ‌యించ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని ఆయ‌న అన్నారు. క‌థానుగుణంగా మ‌న తెలుగు రాష్ట్రాల‌లోనే సినిమాలు తీయ‌డం మంచిదేన‌ని, కొంత భాగం ఎక్క‌డ తీసినా అభ్యంత‌రంలేద‌నీ ప్ర‌భుత్వం చెబుతోంది. ఇది ఇప్పుడే కాదు ఎప్ప‌టి నుంచో ఉన్న నిబంధ‌నేన‌ని ఆయ‌న గుర్తు చేశారు.

Exit mobile version