Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.

Bunny Vasu

Bunny Vasu

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల ఎంపిక గురించి నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన సొంత నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి ఇడుపు కాయితం అనే సినిమా చేస్తున్నారు. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తెలుగమ్మాయి, ఫోక్ సాంగ్స్ డ్యాన్సర్ నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలో బన్నీ వాసు మాట్లాడుతూ హీరోయిన్ నాగదుర్గ గురించి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వైరల్‌గా మారాయి. “నేను ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేశాను.. మా వెనుక సుకుమార్ గారు ఉన్నారు, గీతా ఆర్ట్స్ ఉంది. జనరల్ గా మేము పిలిచి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తున్నాం అనగానే ఏ అమ్మాయైనా ఎగిరి గంతేసి, చాలా సంతోషంగా ఓకే చెప్తుందని అనుకున్నా. కానీ, నాగదుర్గ మాత్రం నాకు ఏకంగా 15 రూల్స్ పెట్టింది. మొదట షాక్ తిన్నా.. ఆ తర్వాత ఆమె క్లారిటీ చూసి నాకు ఎంతో ముచ్చటేసింది.” అని నిర్మాత బన్నీ వాసు అన్నారు.

తమిళ, కన్నడ, నార్త్ హీరోయిన్లతో పనిచేసే టాలీవుడ్‌లో ఒక తెలుగు అమ్మాయితో పనిచేయడం సరికొత్త అనుభూతిని ఇచ్చిందని బన్నీ వాసు తెలిపారు. “ఒక తెలుగు అమ్మాయి సినిమా చేస్తోందంటే ఎంత స్పష్టతతో ఉంటుందో నాగదుర్గను చూశాక అర్థమైంది. తను ఏం చేయగలదు, ఏం చేయలేదు.. వేటికి ఒప్పుకుంటుంది, వేటికి ఒప్పుకోదు అనేది ముఖం మీదే ఎంతో క్లారిటీగా చెప్పేసింది. అప్పుడు అనిపించింది.. ‘ఎస్, ఐ యామ్ డీలింగ్ విత్ ఎ తెలుగు గర్ల్’ అని! ఆమె క్లారిటీ చూసి సినిమా కోసం మేమే కొన్ని విషయాల్లో మారాం” అని బన్నీ వాసు ప్రశంసలు కురిపించారు. నాగదుర్గ ఆల్రెడీ యూట్యూబ్‌లో పెద్ద స్టార్ అని, అక్కడ తన డాన్సులతో ఇరగొట్టేసిన ఆమె ఇప్పుడు వెండితెరపై కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయబోతోందని మేకర్స్ నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాలో ఒక చిన్న సమస్య వచ్చిందని బన్నీ వాసు నవ్వుతూ చెప్పారు. “ఇది పక్కా ఎమోషనల్ ప్యాక్ ఉన్న సినిమా.. కమర్షియల్ మూవీ కాదు. కాబట్టి కథలో ఎక్కడా పెద్దగా డాన్స్ నెంబర్లు లేవు. అంత పెద్ద డాన్సర్‌ని పెట్టుకుని సినిమాలో అస్సలు డాన్స్ లేకపోతే ఎలా అని ఆలోచించి.. హీరో ప్రియదర్శి, నేను, డైరెక్టర్ అందరం అనుకుని నాగదుర్గ కోసం ప్రత్యేకంగా ఒక 40 సెకండ్ల పవర్‌ఫుల్ మ్యూజిక్ బిట్ కంపోజ్ చేయించాం. ఆ బిట్‌కు నాగదుర్గ చేసే డాన్స్ థియేటర్లలో స్క్రీన్ చిరిగిపోయేలా ఉంటుందని మాత్రం గ్యారెంటీ ఇవ్వగలను” అంటూ బన్నీ వాసు సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లారు.