ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రముఖ నటి, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ది ముంబై అకాడమీ ఆఫ్ మూవీంగ్ ఇమేజ్ (మామి) ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసింది. తనకున్న బిజీ షెడ్యూల్స్ లో ‘మామి’ పదవికి న్యాయం చేయలేనంటూ దీపికా పదుకొనే తన రాజీనామా లేఖలో పేర్కొంది. అయితే ఇప్పుడు ఆ పదవిని ‘మామి’ బోర్డ్ ట్రస్టీలు మరో స్టార్ హీరోయిన్, అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా జోనస్ కు కట్టబెట్టారు. ఆమెను ‘మామి’ ఛైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సంస్థకు నీతా అంబానీ కో-ఛైర్ పర్సన్ కాగా, ఫర్హాన్ అక్తర్, అనుపమ చోప్రా, కిరణ్ రావ్, రానా దగ్గుబాటి, రోహన్ సిప్పి, జోయా అక్తర్ తదితరులు ట్రస్టీలుగా ఉన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, సరికొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ‘మామి’ ఛైర్ పర్సన్ గా ప్రయాణాన్ని కొనసాగిస్తాన’ని ప్రియాంక చోప్రా ఈ సందర్భంగా తెలిపింది. తొలినాటి నుండి భారతదేశ వ్యాప్తంగా రూపుదిద్దుకునే సినిమాలకు తాను మద్దత్తు పలుకుతూ వచ్చానని, ఇక మీదట కూడా భారతీయ సినిమాను అంతర్జాతీయ యవనికపై ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటాన’ని ప్రియాంక చోప్రా చెప్పింది.
