Priyanka Chopra Birthday Special :
దక్షిణాది చిత్రాలతోనే ప్రియాంక చోప్రా అభినయ పర్వం ప్రారంభం కావడం విశేషం! తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన ‘తమిళన్’ చిత్రంతో ప్రియాంక తొలిసారి తెరపై తళుక్కుమంది. అంతకు ముందే తెలుగు చిత్రం ‘అపురూపం’లో ప్రియాంక నాయికగా నటించింది. కానీ, ఆ సినిమా ఇప్పటి దాకా వెలుగు చూడలేదు. ఆ తరువాతే ఉత్తరాదిన హిందీలో తనదైన బాణీ పలికించింది ప్రియాంక. నేడు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సంపాదించి సక్సెస్ రూటులో సాగిపోతోంది.
ప్రియాంక చోప్రా 1982 జూలై 18న జెమ్ షెడ్ పూర్ లో జన్మించింది. ఆమె కన్నవారు మిలిటరీ ఫిజీషియన్స్. అందువల్ల తరచూ మిలిటరీ క్యాంప్స్ లో పనిచేసేవారు. అలా చిన్నతనంలోనే ప్రియాంక పలు ప్రాంతాలు చుట్టేసింది. తన 13వ యేట అమెరికాలో తన ఆంటీ దగ్గర ఉండి చదువు సాగించింది. తరువాత మిస్ వరల్డ్ 2000గా కిరీటం సొంతం చేసుకుంది. ఆ సమయంలోనే ఈ బ్యూటినీ దక్షిణాదివారు ఏరి కోరి మరీ తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన ప్రియాంక నటించిన ‘అందాజ్’ మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. తరువాత బాబీ డియోల్ “కిస్మత్, బర్సాత్” చిత్రాలలో అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. హృతిక్ రోషన్ ‘క్రిష్’, షారుఖ్ ఖాన్ ‘డాన్, డాన్ -2’, సల్మాన్ ఖాన్ ‘సలామ్ – ఏ- ఇష్క్’ చిత్రాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది ప్రియాంక. 2008లో మధుర్ భండార్కర్ ‘ఫ్యాషన్’ సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకోవడంతో ప్రియాంక పేరు మరింతగా జనం మదిలో నిలచింది. “కమీనే, బర్ఫీ, బాజీరావ్ మస్తానీ, మేరీ కోమ్” చిత్రాలతో నటిగానూ మరింత గుర్తింపు సంపాదించిందామె.
హాలీవుడ్ మూవీస్ “బేవాచ్, ద వైట్ టైగర్, మాట్రిక్స్: రిసర్రెక్షన్స్” చిత్రాల్లోనూ ప్రియాంక అందం హిందోళం పాడింది. అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్ ను 2018లో వివాహమాడింది. ఈ దంపతులకు ఈ యేడాది జనవరిలో ఓ పాప పుట్టింది. ఇప్పటికీ ప్రియాంక చోప్రా క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా సాగుతోంది. ఈ యేడాదితో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోన్న ప్రియాంక మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.