Site icon NTV Telugu

Priyamani: ఆ అమ్మడి చేతిలో మొన్న వంట గరిటే… నేడు రివాల్వర్!

Dr 56 Poster

Dr 56 Poster

Priyamani: ప్రముఖ కథానాయిక ప్రియమణి ఇప్పుడు రొటీన్ సినిమాలకు తిలోదకాలిచ్చేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై దృష్టి పెట్టింది. కథాబలం ఉండాలే కానీ ఓటీటీ సినిమాలకు సైతం సై అంటోంది. అలా ఆమె నటించిన థ్రిల్లర్ మూవీ ‘భామా కలాపం’ ఆ మధ్య ఆహాలో విడుదలై ప్రియమణికి చక్కని పేరు తెచ్చిపెట్టింది. తాజాగా ఆమె నటించిన ‘డాక్టర్ 56’ మూవీ డిసెంబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఇది మెడికల్ రిలేటెడ్ మూవీ అనే విషయం అర్థమైంది. అయితే అందులో ప్రియమణి స్టెతస్కోప్ కాకుండా రివాల్వర్ చేతిలోకి తీసుకున్న వైనం చూస్తుంటే… ఆమె పోలీస్ ఆఫీసర్ అనే విషయం తెలిసింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో విజయ్ సేతుపతి కూడా పాల్గొనే సరికీ అందరి దృష్టినీ ‘డాక్టర్ 56’ ఆకర్షించింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇండియాలో ఐదేళ్లలో 2163 మంది అంటూ సస్పెన్స్‌గా వదిలేశారు! మోషన్ పోస్టర్లో చూపించిన ఈ సంఖ్య, ప్రియమణి గన్నుపట్టుకున్న తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా మూవీపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ‘డాక్టర్ 56’ మూవీని నిర్మించారు. ఇదే బ్యానర్ లో ప్రభుదేవా ‘ఫ్లాష్ బ్యాక్’, ‘వర ఐపీఎస్, ‘ఛేజింగ్’ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వీటినీ వీలైనంత త్వరగా విడుదల చేయబోతున్నారు. ‘డాక్టర్ 56’ మూవీకి కథ, కథనాలను ప్రవీణ్‌ అందిస్తుండగా రాజేష్‌ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్ మీద ఈ సినిమాను ప్రవీణ్‌ రెడ్డి. టి తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. దీనికి నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూర్చగా, విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్‌గా, రాకేష్ సి తిలక్ కెమెరామెన్‌గా, విశ్వ ఎన్ ఎమ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. మాటలు భార్గవ్ రామ్ అందిస్తుండగా, పాటలకు సాహిత్యాన్ని చల్లా భాగ్యలక్ష్మీ , జె. లక్ష్మణ్ అందించారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్‌ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Exit mobile version