Site icon NTV Telugu

Priyamani: పాత్రను బట్టి నా డిమాండ్ ఉంటుంది – ప్రియమణి

Priyamani

Priyamani

సినీ ఇండస్ట్రీలో వేతన అసమానత (Pay Disparity) అనేది చాలా కాలంగా చర్చనీయాంశం. పలువురు నటీనటులు ఈ విషయం పై తమ అనుభవాలను పంచుకున్నారు. తాజాగా నటి ప్రియమణి కూడా ఈ అంశంపై తన స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో పేరు తెచ్చుకున్న ఈ నటి, పారితోషికం కంటే పాత్రకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతోంది. తాజా ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ ..

Also Read : Sreeleela : నేను శ్రీదేవిని కాదు.. నా బాడీ టైప్‌ నాకు తెలుసు – శ్రీలీల

“నిజం చెప్పాలంటే, నేను నా కెరీర్‌లో అనేక సందర్భాల్లో సహనటుల కంటే తక్కువ పారితోషికం తీసుకున్నాను. కానీ దీంతో నాకు ఎప్పుడూ బాధ కలగలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు డబ్బు కోసం సినిమాలు చేయను. నాకు పాత్ర బాగుంటే, అది ఎంత చిన్నదైనా నేను సంతోషంగా అంగీకరిస్తాను. మన స్టార్‌డమ్‌ ఆధారంగా పారితోషికం నిర్ణయిస్తారు, దాన్ని నేను అంగీకరిస్తాను. అయితే నాకు అనిపిస్తే నేను ఆ పాత్రకు అర్హురాలిని అని అప్పుడు మాత్రం తగిన రీతిలో డిమాండ్‌ చేస్తాను. కానీ, ఎప్పుడూ అనవసరంగా రేమ్యూనరేషన్‌ పెంచమని కోరను. మన కళ, మన కృషి మనకు గుర్తింపు తెస్తాయి. ఒక మంచి పాత్ర మన కెరీర్‌కి దిశ చూపగలదు. అందుకే నేను డబ్బు కంటే పాత్రలకు ప్రాధాన్యత ఇస్తాను. ప్రేక్షకులు నన్ను గుర్తుపెట్టుకునేది నా నటన వల్లే, నా పారితోషికం వల్ల కాదు” అని తెలిపింది.

అంతేకాకుండా, దక్షిణాది మరియు ఉత్తరాది సినీ పరిశ్రమల మధ్య పని విధానంలో ఉన్న తేడాల గురించి కూడా ప్రియమణి ఆసక్తికరంగా వివరించింది. “సౌత్‌లో షూటింగ్‌ షెడ్యూల్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని చెబితే, నిజంగానే ఆ సమయానికి షూటింగ్‌ మొదలవుతుంది. కానీ నార్త్‌లో మాత్రం ఆ సమయానికి నటీనటులు ఇంటినుంచి బయల్దేరుతారు. వర్క్‌ డిసిప్లిన్‌లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది” అని చెప్పింది. ప్రస్తుతం ప్రియమణి వరుసగా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’, ‘ది గుడ్ వైఫ్’ వంటి వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించింది. త్వరలోనే తమిళ స్టార్‌ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జన నాయగన్‌’లో కూడా కీలక పాత్రలో కనిపించనుంది.

Exit mobile version