మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు సినిమా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలానే ఈ నెల 16వ తేదీ ఉదయం 11. 45 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే… ‘మా’ ఎన్నికలలో గెలిచి, అనంతరం పదవులకు రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ బృందం తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రకాశ్ రాజ్ ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోషన్ ను ఎన్నికల సమయంలో రికార్డ్ చేసిన సీసీ ఫుటేజ్ ఇవ్వాల్సింది గా కోరారు.
ప్రకాశ్ రాజ్ ఎన్నికల అధికారికి గురువారం ఓ లేఖ రాస్తూ, ”ఇటీవల పూర్తయిన ‘మా’ ఎన్నికల్లో జరిగిన దురదృష్టకర సంఘటనలకు మీరు సాక్షిగా ఉన్నారు. డి.ఆర్.సి. సభ్యులు శ్రీ మోహన్ బాబు మరియు మాజీ అధ్యక్షులు శ్రీ నరేశ్ అసాంఘిక చర్యలకు పాల్పడ్డారు. ‘మా’ సభ్యులను తిట్టడం, బెదిరించడంతో పాటు భౌతిక దాడికి దిగారు. ఎన్నికల అధికారిగా మీకు ఉన్న విచక్షణా అధికారం కారణంగానే వారి అనుయాయులు పోలింగ్ ప్రాంతంలోకి వచ్చారని నేను భావిస్తున్నాను.
Read Also : నోయల్ ’14’ మూవీ టీజర్ విడుదల చేసిన శ్రీవిష్ణు
అలానే అక్కడ జరిగిన కొన్ని సంఘటనల విజువల్స్ మీడియాలోనూ ప్రసారం అయ్యాయి. దాంతో ‘మా’ ఎన్నికలు, తదనంతర పరిణామాలు ప్రజల దృష్టిలో నవ్వులాటగా మారిపోయాయి. పోలింగ్ కేంద్రంలో అసలు ఏం జరిగిందనే విషయం ‘మా’ సభ్యులకు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు.
మీరు ఎన్నికల ముందు మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలను పెడతామని చెప్పారు. వాటిలో అన్ని రికార్డ్ అయి ఉంటాయని నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని పొందడం మాకున్న ప్రజాస్వామిక హక్కుగా నేను భావిస్తున్నాను. ఓ ఎన్నికల అధికారిగా సంబంధిత రికార్డులను కనీసం మూడునెలల పాటు భద్రపర్చడం మీ విధి. సుప్రీం కోర్టు సైతం పలు తీర్పులలో ఎన్నికలకు సంబంధించిన రికార్డులను పోలింగ్ ఆఫీసర్స్ జాగ్రత్త చేయాలని చెప్పింది. కాబట్టి వీలైనంత త్వరగా ఆ సీసీ ఫుటేజ్ ను మాకు ఇవ్వవలసింది. ఒకవేళ మీరు దీనిపై వెంటనే స్పందించకపోతే ఆ ఫుటేజ్ డెలీట్ చేయబడిందని లేదా ట్యాంపర్ అయ్యిందని భావించాల్సి ఉంటుంది” అని ప్రకాశ్ రాజ్ ఆ లేఖ ద్వారా తెలిపారు. మరి దీనికి ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ఎలా స్పందిస్తారో చూడాలి.