చిత్రసీమలో రాణించాలంటే గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా, ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఇది పాత సామెతే! కానీ, ఏ నాటికైనా పనికి వచ్చే సినిమా సామెత! అందాల భామ ప్రగ్యా జైస్వాల్ విషయంలో ఈ సామెత నిజమయిందనే చెప్పాలి. అమ్మాయిని చూడగానే నాజుకు షోకులతో ఆకట్టుకొనే మెరుపు తీగెలా ఉంటుంది. అలాగే, ముఖంలో భావాలను పలికించడంలోనూ మేటి అనిపిస్తుంది. కానీ, ఏం లాభం ఇప్పటి దాకా ఆమె నటించిన ఏ చిత్రమూ అంతగా జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. అయితే అదృష్టం ప్రతిభావంతులతో ఎంతోకాలం ఆడుకోదు, ఏదో ఒకరోజున కరుణిస్తుంది. అందుకు తగ్గట్టుగానే 2021 బ్లాక్ బస్టర్ ‘అఖండ’లో బాలకృష్ణ లాంటి టాప్ స్టార్ సరసన ప్రధాన నాయికగా నటించే అవకాశం ప్రగ్యాకు లభించింది. అందివచ్చిన అవకాశం కదా, తన అందాల అభినయంతో అలరించి, జనాన్ని ఇట్టే ఆకట్టుకుంది ప్రగ్యా జైస్వాల్.
ప్రగ్యా జైస్వాల్ 1991 జనవరి 12న జన్మించింది. పూనాలోని ‘సింబయోసిస్ లా స్కూల్’లో చదువుకుంది. ఫైనల్ ఇయర్ లో ఉండగా, ప్రగ్యా మనసు మోడలింగ్ వైపుకు మళ్ళింది. మెరుపు లాంటి అందం ప్రదర్శిస్తూ పలు యాడ్స్ లో నటించింది. ఆమె చదివే లా స్కూల్ వారే, ‘సింబయోసిస్ సాంస్కృతిక్ పురస్కార్’తో సన్మానించారు. అలా ఈ అందం ముంబై మోడలింగ్ ప్రపంచంలో ఓ మెరుపు మెరిసింది. తమిళ దర్శకుడు కుమార్ .టి తన కుమారుడు సుజీవ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘విరాట్టు’ అనే చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమాలోనే ప్రగ్య అందం తొలిసారి వెండితెరపై మెరిసింది. ఇదే సినిమా తెలుగులో ‘డేగ’ పేరుతో అనువాదమయింది. అప్పట్లో ఎవరూ ఆ సినిమాను పట్టించుకోలేదు. తరువాత హిందీలో ‘టిటూ ఎమ్.బి.ఏ.’లో నటించింది. ఆ సినిమా సైతం ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో ప్రగ్య నటించిన తొలి స్ట్రెయిట్ మూవీ ‘మిర్చిలాంటి కుర్రాడు’. ఇది కూడా అంతే సంగతులు అనిపించింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘కంచె’ నటిగా ప్రగ్యకు మంచి పేరు సంపాదించి పెట్టింది. అంతే తప్ప, పెద్దగా ఒరిగిందేమీ లేదు. నాగార్జునతో రాఘవేంద్రరావు రూపొందించిన ‘ఓం నమో వేంకటేశాయ’లో భవానీ పాత్రలో ప్రగ్య కనిపించింది. మంచు మనోజ్ ‘గుంటూరోడు’లోనూ ప్రగ్యనే నాయిక. కృష్ణవంశీ తెరకెక్కించిన ‘నక్షత్రం’లో కిరణ్ రెడ్డి ఐపీయస్ పాత్రలో విజృంభించి నటించింది ప్రగ్య. కానీ, ఏం లాభం ఆ సినిమా కూడా ఆకట్టుకోలేక పోయింది.
మంచి పాత్రలే పలకరించినా, నటిగా మంచి మార్కులే సంపాదించినా, చిత్రసీమకు కావలసిన ఓ గ్రాండ్ సక్సెస్ ప్రగ్య దరి చేరలేదు. ఈ సమయంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన ఓ నాయికగా ‘జయ జానకీ నాయక’లో నటించింది ప్రగ్య. ఇందులో ప్రధాన నాయిక రకుల్ ప్రీత్ సింగ్. అయినా, తనకున్న పరిధిలో తాను నటించి మంచి మార్కులు కొట్టేసింది ప్రగ్య. మంచు విష్ణు సరసన ‘ఆచారి అమెరికా యాత్ర’లోనూ ప్రగ్య మెరిసింది. పేరు లభించినా, పరాజయాలు మాత్రం ప్రగ్యను పలకరిస్తూనే వచ్చాయి. అలాంటి ప్రగ్యను దాదాపు మూడేళ్ళ పాటు ఏ తెలుగు దర్శకుడు కానీ, నిర్మాత కానీ పలకరించలేదు. మనవాళ్ళే కాదు, ఎవరూ ప్రగ్య గురించి ఆలోచించలేదు. అలాంటి ప్రగ్యను బోయపాటి శ్రీను ‘అఖండ’లో బాలకృష్ణ సరసన నాయికగా ఎంపిక చేయగానే పలు వ్యాఖ్యలు వినిపించాయి. అంతకు ముందు బోయపాటి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అమ్మాయిని, బాలయ్య వంటి టాప్ హీరో సరసన నటింప చేయడమంటే నిజంగా సాహసమే! మార్కెట్ పరంగానూ సినిమాకు అది ప్లస్ కాదు. అయినా, హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను ఆమెకు అవకాశం కల్పించారు. ‘అఖండ’లో శరణ్య బాచుపల్లి ఐఏఎస్ గా ప్రగ్య భలేగా ఆకట్టుకుంది. కలెక్టర్ గా హుందాగా నటిస్తూనే, మరోవైపు తనదైన అభినయంతో మురిపించింది. ముఖ్యంగా బాలకృష్ణ, ప్రగ్యపై చిత్రీకరించిన “జై జై జై బాలయ్యా…” పాట ఆబాలగోపాలాన్నీ అలరించింది. ‘అఖండ’ ఘనవిజయం సాధించింది. అందరూ చేసిన వ్యాఖ్యలు చెల్లాచెదురయ్యాయి. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ కూడా తెలుగునాట పేరున్న తారగా నిలచింది. మరి ‘అఖండ’ విజయంతో ప్రగ్యా జైస్వాల్ కు ఎలాంటి అవకాశాలు లభిస్తాయో చూద్దాం.