NTV Telugu Site icon

Prabhas – Maruthi Movie: ఏమో హిట్ కొట్టవచ్చు!

Prabahs

Prabahs

Prabhas-Maruthi Movie: సినిమా రంగంలో అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. ‘వాళ్ళతో సినిమానా!? ఇక హిట్ అయినట్టే!’ అని పెదవి విరిచిన వాళ్ళే ముక్కున వేలేసుకున్న సంఘటనలూ చాలానే జరిగాయి. లేటెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో దర్శకుడు మారుతీ సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. నవంబర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. మారుతీ చెప్పిన కథ ఎగ్జయిట్ చేయడంతో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

ప్రభాస్ – మారుతీ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకోవడానికి ఒకరోజు ముందు #BoycottMaruthiFromTFI పేరుతో సోషల్ మీడియాలో కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. పాన్ ఇండియా స్టార్ అయిన తమ అభిమాన నటుడు ప్రభాస్ తన స్థాయిని తగ్గించుకుని, మారుతీతో సినిమా చేయడం ఏమిటి? అనేది వారి భావన కావచ్చు! ఉత్తరాదిన కొంతకాలంగా జరుగుతున్న బాయ్ కాట్ ట్రెండ్ కు ఓ కారణం ఉంది. నెపోటిజాన్ని సమర్థిస్తున్న కారణంగా కొందరు, హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా మరికొందరు బాలీవుడ్ హీరోలను, హీరోయిన్లను, డైరెక్టర్లను, ప్రొడ్యూసర్స్ ను బాయ్ కాట్ చేయమంటూ సోషల్ మీడియా ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ చిత్రంగా ఓ డైరెక్టర్ ఓ స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ ను దక్కించుకోవడాన్ని ఓర్వలేక పోవడం, ఆ దర్శకుడిని తెలుగు ఇండస్ట్రీ నుండే బాయ్ కాట్ చేయమని ప్రచారం చేయడం దారుణం.

చాలా మంది హీరోలకు.. ఎలాంటి అంచనాలు లేని దర్శకులే ఫస్ట్ కాంబినేషన్ లో సూపర్ హిట్స్ ఇచ్చిన సంఘటనలు బోలెడు ఉన్నాయి. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. 2003లో వచ్చిన ‘జానీ’ నుండి ఆయన వరుస పరాజయాలను చవిచూస్తూ వచ్చారు. ‘గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం’ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పవన్ కళ్యాణ్‌ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అప్పటికి త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘నువ్వే – నువ్వే’ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. రెండో సినిమా ‘అతడు’ కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన పవన్ – త్రివిక్రమ్ ఫస్ట్ కాంబినేషన్ మూవీ ‘జల్సా’ సూపర్ హిట్ అయ్యి సరికొత్త రికార్డులు నెలకొల్పొంది. అలానే ‘పులి, తీన్ మార్, పంజా’ సినిమాల పరాజయం తర్వాత పవన్ తో తొలిసారి వర్క్ చేసిన డైరెక్టర్ హరీశ్ శంకర్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘గబ్బర్ సింగ్’ను అందించాడు. దానికి ముందు హరీశ్ శంకర్ తీసిన ‘షాక్’ ఫ్లాప్ కాగా.. ‘మిరపకాయ్’ మాత్రం సక్సెస్ అయింది. ఇక నందమూరి నట సింహం బాలకృష్ణ కు 2001లో ‘నరసింహ నాయుడు’ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ మూవీ కొంతకాలం పాటు పడలేదు. ‘భలేవాడివి బాసు, సీమ సింహం, చెన్నకేశవ రెడ్డి, పల్నాటి బ్రహ్మానాయుడు’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఆ సమయంలో బాలకృష్ణతో మూవీ చేసే అవకాశం దర్శకుడు జయంత్ కు లభించింది. వీరిద్దరి ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన ‘లక్ష్మీ నరసింహా’ సూపర్ హిట్ అయ్యింది. దానికి ముందు జయంత్ డైరెక్ట్ చేసిన ‘రావోయి చందమామ, టక్కరి దొంగ, ఈశ్వర్’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ‘లక్ష్మీ నరసింహా’తో ఆయన మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కారు.

అలాగే ‘గణేశ్, ప్రేమంటే ఇదేరా’ వంటి యావరేజ్ సినిమాల తర్వాత వెంకటేశ్ ముప్పలనేని శివతో ‘రాజా’ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ముప్పలనేని శివకు ‘రాజా’కు ముందు ‘స్పీడ్ డాన్సర్, శుభలేఖలు’ వంటి ప్లాఫ్స్ ఉన్నాయి. వెంకీ, శివ కలయికలో వచ్చిన తొలి సినిమా ‘రాజా’ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కూడా వీరి కలయికలో ‘సంక్రాంతి’ వంటి హిట్ వచ్చింది. ఇక ఇప్పటి విషయానికి వస్తే.. మారుతి డైరెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ కాకపోవచ్చు కానీ అవేవీ లాస్ ప్రాజెక్ట్స్ కాదు. ‘ప్రతి రోజూ పండగే’ తర్వాత మారుతి డైరెక్ట్ చేసిన ‘మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్’ మూవీస్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అంతమాత్రం చేత అతనిలో సరుకు అయిపోయిందని అనుకోవాల్సిన పనిలేదు. అలానే ప్రభాస్ కు ‘బాహుబలి’ తర్వాత మళ్ళీ అలాంటి హిట్ మూవీ పడలేదు. ‘సాహో, రాధేశ్యామ్’ పరాజయం పాలయ్యాయి. అయినా ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. కాస్తంత ఛేంజ్ ఓవర్ కోసం, అలానే తన చిత్రాల మీద ఉన్న భారీ అంచనాలను తగ్గించుకోవడం కోసం మారుతితో సినిమాను అంగీకరించి ఉంటాడు. సో.. అటు హీరోకు, ఇటు డైరెక్టర్ కు అభ్యంతరం లేనప్పుడు, వీరిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా భావించినప్పుడు మధ్యలో అభిమానులు ఆక్షేపణలు పెట్టడం అర్థం లేనిది! ఏమో గుర్రం ఎగరావచ్చు హిట్ పడవచ్చు అన్నట్టుగా.. ప్రభాస్ – మారుతీ కాంబో మూవీ అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అవుతుందేమో! ఎవరు చెప్పగలరు!!

Show comments