NTV Telugu Site icon

Director Maruthi: మేం కోరుకుంటోంది ఇది కాదంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!

Maruthi

Maruthi

Prabhas Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ మారుతి సైలెంట్ గా సినిమా చేసేస్తున్న విషయం తెలిసిందే! అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత గోప్యంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. ఈ సినిమా అప్ డేట్స్ మారుతి చెబుతాడేమోనని ప్రభాస్ ఫాన్స్ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మారుతీ ఓ సూపర్ న్యూస్ ను ట్వీట్ చేశాడు. అంతే… అదేమిటో నంటూ తెగ ఆరాటపడుతూ అభిమానులంతా దానిపై ఓ లుక్ వేశారు. ఇంతకూ అదేమిటంటే… తన సొంతూరు మచిలీపట్నంలో సీతారామారావు అనే క్షురకుడు వందేళ్లు పూర్తి చేసుకున్నాడన్నది ఆ వార్త. బందరు పాత రామన్నపేటలో ఉండే సదరు సీతారామారావు తన తాతకు, తండ్రికి, తనకు కూడా హెయిర్ కటింగ్ చేశాడని, అది తనకో చైల్డ్ హుడ్ మెమొరీ అని మారుతి ట్వీట్ చేశాడు. వందేళ్ళు వచ్చినా సీతారామారావు గారు ఇప్పటికీ హెయిర్ కటింగ్ చేస్తున్నారని, గొప్ప స్ఫూర్తిని అందించే ఆయన మరింత కాలం జీవించాలని కోరుకుంటున్నట్టు మారుతి తెలిపాడు. ఆ మధ్య విశాఖపట్నంలో ప్రొఫెసర్ శాంతమ్మ గారు తొంభై యేళ్ళు పైబడినా ఎంచక్కా బస్ లో కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్ కు పాఠాలు చెబుతున్న విషయాన్ని మనం చూశాం. ఇప్పుడీయన వందేళ్ళు పూర్తయినా తన కుల వృత్తిని కొనసాగిస్తున్నారు. నిజంగానే ఇలాంటి వారి నుండి నేటి యువత ఎంతో స్ఫూర్తి పొందాలి.

బట్… ఇదిలా ఉంటే… దర్శకుడు మారుతి నుండి తాము ఆశిస్తోంది ఇది కాదంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ‘అన్నా… మన సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వండి’ అంటూ సోషల్ మీడియాలో మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటికే ‘ఆదిపురుష్‌’, ‘సలార్’ చిత్రాల షూటింగ్స్ ను ప్రభాస్ పూర్తి చేశాడు. వాటికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. దాంతో ఇప్పుడు మారుతీ మూవీపై ప్రభాస్ దృష్టి పెట్టాడు. సో… ‘ఆ సినిమా ఎంతవరకూ వచ్చింది, అందులోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయాలు చెప్పకుండా… ఈ సొంత గొడవ మాకెందుకు’ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కూనిరాగాలు తీస్తున్నారు. మరి మారుతి నుండి ప్రభాస్ సినిమా అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.