Site icon NTV Telugu

Ari: ఎలా బతకకూడదో చెప్పబోతున్న అనసూయ!

Ari

Ari

‘సోగ్గాడే చిన్ని నాయనా’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ యాంకర్ అనసూయ ‘రంగస్థలం’తో నటిగా తన సత్తాను చాటుకుంది. అలానే మధ్య మధ్యలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ సోలో హీరోయిన్ గానూ సక్సెస్ ను అందుకుంటోంది. తాజాగా ‘అరి’ అనే సినిమాలో ఆమె కీ-రోల్ ప్లే చేసింది. గతంలో ‘పేపర్ బాయ్’ మూవీని తెరకెక్కించిన జయశంకర్ ‘అరి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్వీ రెడ్డి ప్రెజెంటర్. ఈ మూవీ టైటిల్ లోగోను శుక్రవారం హుజూరాబాద్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆవిష్కరించారు. ఈ టైటిల్ లోగో ఆవిష్కరణలో ‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సైతం పాలుపంచుకున్నారు. సాయికుమార్, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర ప్రాధాన పాత్రలు పోషించిన ‘అరి’ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్ మాట్లాడుతూ, ”నిర్మాత‌కు క‌థ‌ను చెప్పి వెంటనే ఒప్పించ‌గ‌లిగాను. కానీ ‘అరి’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేయించడానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాను. ఇది సంస్కృత‌ ప‌దం. అరి అంటే శ‌త్రువు అని అర్థం. అది ఏమిటి? అనేది సినిమాలో చెప్పాను. కె. వి. రెడ్డి గారు ఓ సంద‌ర్భంలో, సినిమా తీయ‌డ‌మంటే వంద పెళ్ళిళ్లతో స‌మానం అన్నారు. కానీ కోవిడ్ వ‌ల్ల సినిమా తీయ‌డం వెయ్యి పెళ్ళిళ్ళతో స‌మానం అని నాకు అనిపిస్తుంది. ఈ సినిమాను 2020లో క‌రోనా టైంలో చాలా స్ట్ర‌గుల్ ఫేజ్ లో తీశాం. నా తొలి చిత్రం ‘పేప‌ర్‌బాయ్’ కంటే ఈ సినిమాకు మరింత పేరు వ‌స్తుంద‌నే న‌మ్మ‌క‌ముంది” అని అన్నారు. అనసూయ మాట్లాడుతూ, ”ద‌ర్శ‌కుడు క‌థ చెప్పిన‌ప్పుడే చాలా కుతూహ‌లం క‌లిగింది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌లో అద్భుత‌మైన కంటెంట్‌ తో సినిమాలు వ‌స్తున్నాయి. మ‌న‌కెందుకు రావ‌ని చూసిన‌ప్పుడు అనిపించేది. ఈ క‌థ విన్నాక మ‌నం కూడా తీయ‌గ‌లం అనిపించింది. ‘రంగ‌స్థ‌లం’లో రంగ‌మ్మ‌త్త‌గా చేశాక ఇంత పేరు వ‌స్తుంద‌ని అనుకోలేదు. ఈ జ‌న్మ‌కు చాలు అన్న‌ట్లు అనిపించింది. ఆ త‌ర్వాత రెండేళ్ళ‌పాటు అవ‌కాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే వ‌స్తున్నాయి. ల‌క్కీగా ఫీల‌వుతున్నాను. నాకోసం కేరెక్ట‌ర్లు రాస్తున్నారు. ‘పుష్ప’ చాలా సంతృప్తినిచ్చింది. రెండో భాగంలో మంచి పాత్ర వుంది. ఈ సినిమాలో హ్యూమానిటీతోపాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా వుంది. ఎలా బ‌త‌క‌కూడ‌ద‌నే విష‌యాన్ని ఎంట‌ర్‌టైన్‌గా ద‌ర్శ‌కుడు చూపించారు” అని చెప్పారు.

”మ‌నిషి ఎలా బ‌త‌కాలో ఇంత‌కు ముందు సినిమాలు చూపించాయి. కానీ మా సినిమా మ‌నిషి ఎలా బ‌త‌క‌కూడ‌దో చూపిస్తుంది. మంచి విజ‌న్ వున్న ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్‌” అని నిర్మాత శేషు చెప్పారు. ‘ఈ సినిమాలో మంచి కామెడీ వుందని, మ‌ళ్ళీ మ‌ళ్ళీ చూసే విధంగా దీనిని తీశామని, అనూప్ రూబెన్స్ రావ‌డంతో ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌నే న‌మ్మ‌కం క‌లిగింద‌’ని మరో నిర్మాత శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు, చమ్మక్ చంద్ర, అనూప్ రూబెన్స్, ప్రభాస్ శ్రీను తదితరులు మాట్లాడి తమ అభిప్రాయాన్ని తెలియచేశారు.

 

Exit mobile version