NTV Telugu Site icon

Pooja Hegde: సామజవరగమనా.. నిను చూసి ఆగగలమా!?

Pooja

Pooja

Pooja Hegde: ఒక్కసారి చూస్తే చాలు చూపు తిప్పుకోకుండా చేసే అందం పూజా హెగ్డే సొంతం. జయాపజయాలతో నిమిత్తం లేకుండా పూజా చిత్రాలను చూసి, ఆమెకు తమ కలలరాణిగా పట్టాభిషేకం చేశారు ఎందరో రసిక శిఖామణులు. పూజా అందం చూసి కుర్రకారు కిర్రెక్కిపోతూ థియేటర్లకు పరుగులు తీస్తారు. అదీ – పూజా అందంలోని బంధం వేసే మహత్తు!

పూజా హెగ్డే 1990 అక్టోబర్ 13న ముంబైలో జన్మించింది. ఆమె కన్నవారు కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు. ముంబైలోని ఎమ్.ఎమ్.కె. కాలేజ్ లో చదువుతున్న రోజుల్లోనే పలు భాషల్లో పట్టు సాధించడమే కాదు, ఫ్యాషన్ షోస్ లో పాల్గొని అలరించింది. అలా అలా పూజా హెగ్డే పేరు గ్లామర్ మార్కెట్ లో మారు మోగింది. తమిళ దర్శకుడు మిస్కిన్ తన ‘ముగమూడి’ చిత్రంలో పూజాను నాయికగా ఎంచుకున్నారు. జీవా హీరోగా రూపొందిన ఈ చిత్రంలో తొలిసారి తెరపై తళుక్కుమంది పూజా హెగ్డే. తరువాత నాగచైతన్య హీరోగా రూపొందిన ‘ఒక లైలా కోసం’తో తెలుగునాట అడుగుపెట్టింది.

ఆపై ‘ముకుంద’ చిత్రంలోనూ నటించింది. ఈ మూడు చిత్రాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. హిందీలో ఆమె తొలి చిత్రం హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘మొహెంజో దారో’. అదికూడా అలరించలేదు. దాంతో పూజా హెగ్డే పాదంపై చిత్రసీమలో పలు అనుమానాలు రేకెత్తాయి. అల్లు అర్జున్ సరసన నటించిన ‘దువ్వాడ జగన్నాథం’లో పూజా హెగ్డే అందం చిందులు వేసింది. ఆమెను చూడటానికే అన్నట్టు సినిమాకు జనం పరుగులు తీశారు. ఆ చిత్రం మంచి ఓపెనింగ్స్ చూసింది. రామ్ చరణ్ ‘రంగస్థలం’లో “జిల్ జిల్ జిగేలు రాణి…”గా కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది.

Read Also:Vijay Antony: కోలీవుడ్ హీరో విజయ్ విడాకులు..?

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన ‘సాక్ష్యం’లో మెరిసింది. మళ్ళీ మామూలే అన్నట్టుగా సాగింది పూజా చిత్ర ప్రయాణం. జూనియర్ యన్టీఆర్ తో ‘అరవింద సమేత’లో అరవిందగా ఆకట్టుకుంది. ‘మహర్షి’లో మహేశ్ బాబు సరసన మురిపించింది. ‘గద్దలకొండ గణేశ్’లో మరో శ్రీదేవి అనిపించింది. ఇక అల్లు అర్జున్ తో రెండో సారి నటించిన ‘అల వైకుంఠపురములో..’తో బంపర్ హిట్ ను తన బ్యాగ్ లో వేసుకుంది.

అప్పటి దాకా పూజా హెగ్డే చిత్ర ప్రయాణం ఓ తీరున సాగితే, ‘అల..వైకుంఠపురములో’ తరువాత మరో తీరున సాగింది అని చెప్పాలి. ఆ చిత్రం తరువాత పూజా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో అక్కినేని అఖిల్ కు ఓ సక్సెస్ దరి చేరేలా చేసింది. ఇక ‘ఆచార్య’లో రామ్ చరణ్ జోడీగా నటించింది. ప్రభాస్‌ ‘రాధే శ్యామ్’లోనూ పూజా అందం కనువిందు చేసింది, కానీ, కనకవర్షం కురిపించలేకపోయింది.

తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ‘బీస్ట్’లో మురిపించింది. రణవీర్ సింగ్ తో జోడీ కట్టి ‘సర్కస్’ చూపించనుంది. సల్మాన్ ఖాన్ తో ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లోనూ నటించింది. చిత్రమేమిటంటే వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు జనం ముందుకు రానున్నాయి. డిసెంబర్ 23న ‘సర్కస్’ ప్రేక్షకులను పలకరించనుండగా, అదే నెల 30న సల్మాన్ చిత్రం ఆడియెన్స్ ను అలరించే ప్రయత్నం చేయనుంది. మహేశ్ బాబు సరసన మరోమారు నటించబోతోంది పూజ. ఈ యేడాది విడుదల కానున్న పూజా రెండు హిందీ చిత్రాలలో ఏది అలరించినా, ఆమె బాలీవుడ్ లోనూ ఓ హిట్టు పట్టేసినట్టే అవుతుంది. మరి పూజా అందం ఉత్తరాదిన ఎలాంటి బంధాలు వేస్తుందో చూద్దాం.

Read ALso: Ram Gopal Varma: గరికపాటి చూపంతా ఆ హీరోయిన్ మీదే ఉందట.. వర్మ వీడియో వైరల్