Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!

Peddi

Peddi

టాలీవుడ్‌లో గత కొంత కాలంగా రాజుకుంటున్న థియేటర్ల రెంట్స్, పర్సెంటేజీల వివాదం మరింత ముదిరింది. సమస్యను కొలిక్కి తెచ్చేందుకు నేడు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, మరియు ఎగ్జిబిటర్లు మరోసారి అత్యవసరంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఎటువంటి ఏకాభిప్రాయం రాకపోగా.. మూడు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు.

ముఖ్యంగా విడుదలకు సిద్ధమవుతున్న ‘పెద్ది’ సినిమా ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమా ప్రదర్శన విషయంలో తమకు ఖచ్చితంగా పర్సెంటేజ్ కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు గట్టిగా పట్టుబడుతున్నారు. నిర్మాతలు పర్సంటేజ్ కాస్త తక్కువ ఇచ్చినా తాము సర్దుకుపోతామని, కానీ అసలు పర్సెంటేజ్ విధానమే లేకుండా రెంట్ మాత్రమే ఇస్తామంటే మాత్రం కుదరదని ఎగ్జిబిటర్లు తెల్చిచెప్పినట్లు సమాచారం.

ఈ క్రమంలో దిగివచ్చిన నిర్మాతలు ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. థియేటర్ రెంట్‌తో పాటు అదనంగా 7.5 శాతం పర్సెంటేజ్ ఇచ్చేందుకు తాము సిద్ధమేనని నిర్మాతలు ఆఫర్ చేశారు. అయితే, ఇక్కడే ఎగ్జిబిటర్లు మరో మెలిక పెట్టారు. కేవలం ఈ ఒక్క సినిమాకు పర్సెంటేజ్ ఇస్తే సరిపోదని, భవిష్యత్తులో రాబోయే తదుపరి చిత్రాలకు కూడా పర్సంటేజ్ విధానం ఎలా ఉండబోతుంది? ఎంత ఇస్తారు? అనే విషయాలను వివరిస్తూ ‘పెద్ది’ సినిమా రిలీజ్‌కు ముందే తమకు రాతపూర్వకంగా (లెటర్) హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై అంతర్గతంగా చర్చించుకుని, తమ తుది నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు. ఎవరికి వారు పట్టు సడలించకపోవడంతో నేటి మీటింగ్ అసంపూర్తిగా ముగిసింది. నిర్మాతలు రేపు చెప్పబోయే నిర్ణయంపైనే అందరి దృష్టి నెలకొంది. రేపటితో ఈ వివాదానికి ఒక స్పష్టమైన ముగింపు వస్తుందని టాలీవుడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.