LGBT – A Legal Battle: ‘ఎల్‌జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!

Lgbt

Lgbt

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడూ రొటీన్ లవ్ స్టోరీలు, కమర్షియల్ యాక్షన్ సినిమాలే వస్తాయనుకుంటే పొరపాటే. సమాజంలో మరుగున పడిపోయిన చీకటి కోణాలను, ఎవరూ టచ్ చేయని సున్నితమైన అంశాలను ధైర్యంగా వెండితెరపై ఆవిష్కరించే సంచలన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్‌పై సుభాష్ చక్రవర్తి రవడ సహనిర్మాతగా ఆయన రూపొందించిన సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా “ఎల్ జి బీ టీ – ఏ లీగల్ बैటిల్” (LGBT – A Legal Battle). సమాజంలో గే, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలు ఎదుర్కొంటున్న వివక్ష, వారి హక్కుల పోరాటం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 19న దేశవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన చిత్ర యూనిట్ మీడియా సమావేశం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో కేవలం ప్రొఫెషనల్ ఆర్టిస్టులు మాత్రమే కాదు, నిజ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన రియల్ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్టులు కీలక పాత్రలు పోషించారు. తెలంగాణ స్టేట్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా మాట్లాడుతూ “మా హక్కుల కోసం మేము ఎన్నో ఏళ్లుగా రోడ్లెక్కి పోరాడుతున్నాం. కానీ మా బాధలను ప్రపంచానికి చెప్పే సరైన వేదిక దొరకలేదు. సునీల్ కుమార్ రెడ్డి గారు మా సమస్యలను అర్థం చేసుకుని ఈ సినిమా తీశారు. మేము ఇందులో నటన చేయలేదు, మా నిజ జీవితంలో మేము అనుభవించే నరకాన్ని, భావోద్వేగాలను అలాగే చూపించాం.” అన్నారు.

×
×
Ad

గే కమ్యూనిటీ యాక్టివిస్ట్ విష్ణు మాట్లాడుతూ “తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు గే క్యారెక్టర్లను కేవలం జనాన్ని నవ్వించే ఒక జోకర్‌లాగా, కామెడీ కోసం మాత్రమే వాడారు. కానీ ఇతర భాషల్లో, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో వారి సమస్యలపై ఎంతో సీరియస్ సినిమాలు వచ్చాయి. తెలుగులో మొదటిసారి సునీల్ కుమార్ రెడ్డి గారు మాతో పాటు ట్రావెల్ చేసి, మా జీవితాలను దగ్గరగా చూసి ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు.” అన్నారు. ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ హిమ రాథోడ్ (హీరోయిన్) మాట్లాడుతూ.. ఈ సినిమాతో సమాజంలో తమపై ఉన్న అపోహలు, చూసే కోణం ఖచ్చితంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాను తెరకెక్కించే క్రమంలో తాము సెన్సార్ పరంగా కూడా ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నామని సునీల్ కుమార్ రెడ్డి లీక్ చేశారు. ఆల్రెడీ ఈ చిత్రం పూణే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘బెస్ట్ ఫిలిం అవార్డ్’ గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.