సూపర్ స్టార్ రజినీకాంత్ దశాబ్దం క్రితం ఎలాంటి సినిమాలు చేసే వాడో, ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసేవాడో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంభవాన్ని సృష్టించే వాడో… ఆ రేంజ్ కంబ్యాక్ మళ్లీ ఇచ్చేసాడు ‘జైలర్’ సినిమాతో. నెల్సన్ పర్ఫెక్ట్ గా రజినీ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ని వాడుకుంటూ జైలర్ సినిమాని ఒక వర్త్ వాచ్ మూవీగా మలిచాడు. ఇంటర్వెల్ సీన్ నుంచి ఎండ్ కార్డ్ పడే వరకూ రజినీ తాండవాన్ని చూపించాడు. 72 ఏళ్ల వయసులో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కి అయిదేళ్ల పిల్లలు కూడా విజిల్స్ వేయాల్సిందే. ఇక ఈ విజిల్స్ ని మరింత పెంచింది జైలర్ సినిమాలోని పవర్ స్టార్ రెఫరెన్స్. జైలర్ సినిమా సెకండ్ హాఫ్ లో సునీల్, తమన్నా ట్రాక్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇద్దరు సినిమాలో కూడా యాక్టర్స్ గానే నటించారు.
ఈ ఇద్దరినీ పెట్టి సినిమా తీసే దర్శకుడిగా సునీల్ రెడ్డి(డాక్టర్, బీస్ట్ సినిమాల్లో ఉన్న కమెడియన్) నటించాడు. ఈ క్యారెక్టర్ విగ్ తో ఉంటే… ఇతన్ని ఉద్దేశించి సునీల్ “పవన్ కళ్యాణ్ లా ఆ హెయిర్ స్టైల్ ఏంటి” అంటూ ఒక డైలాగ్ చెప్తాడు. ఇది తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో మాత్రమే కాదు తమిళ వెర్షన్ లో కూడా ఉండడం విశేషం. మాములుగా అయితే తెలుగు ఆడియన్స్ కి తెలుగు స్టార్ హీరోల పేర్లు… తమిళ ఆడియన్స్ కి తమిళ స్టార్ హీరోల పేర్లు వాడుతారు. అలాంటిది రెండు భాషల్లో కూడా పవన్ కళ్యాణ్ పేరునే వాడడం కొత్తగా ఉంది. పవన్ కళ్యాణ్ పేరు వినిపించగానే థియేటర్ లో విజిల్స్ మోతమోగింది. అలా సూపర్ స్టార్ సినిమాలో పవర్ స్టార్ పేరు వినిపించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది.
