Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హన్మకొండ పర్యటనలో ఒక అరుదైన, అత్యంత భావోద్వేగ సంఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో మంచాన పడ్డ 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను పరామర్శించిన పవన్.. అతడిలో కొత్త ఆశలు, జీవించేలా చేసేంతటి కొండంత నమ్మకాన్ని నింపారు. నిరంజన్ ఆరోగ్యం క్షీణించిందని తెలిసి, ప్రోటోకాల్స్‌ను పక్కన పెట్టి మరీ పవన్ కళ్యాణ్ హన్మకొండలోని అభిమాని నివాసానికి వెళ్లారు. మంచంపై ఉన్న ఆ కుర్రాడి చేయి పట్టుకుని, గుండెలకు హత్తుకుని మాట్లాడారు. ఈ క్రమంలో నిరంజన్ పవన్ కళ్యాణ్‌తో తనకున్న సినిమా అభిమానాన్ని పంచుకున్నాడు. ముఖ్యంగా ఆయన రాబోయే చిత్రం ‘#OG 2’ (ఓజీ 2) గురించి ఆసక్తిగా మాట్లాడాడు.
అభిమాని ఉత్సాహాన్ని చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్.. అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక క్రేజీ ప్రామిస్ చేశారు. “నువ్వు త్వరగా కోలుకోవాలి.. ఒకవేళ భవిష్యత్తులో మనం ‘#OG2’ (ఓజీ సీక్వెల్) తీస్తే, దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే! నిన్నే ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం” అంటూ నిరంజన్‌కు మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ మాట వినగానే నిరంజన్ ముఖంలో చెప్పలేనంత సంతోషం కనిపించింది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రామిస్ ఆ యువకుడికి వ్యాధితో పోరాడేందుకు ఒక పెద్ద బూస్ట్‌లా పనిచేసిందని అక్కడి వారు అభిప్రాయపడ్డారు. కేవలం రాజకీయ నాయకుడిలా వచ్చి పరామర్శించి వెళ్ళిపోకుండా, ఒక అన్నలా పవన్ కళ్యాణ్ వచ్చి నిరంజన్ గుండెల్లో ధైర్యాన్ని నింపారంటూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓజీ 2 సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూసే అభిమానికి.. ఏకంగా ఆ సినిమాకు స్పెషల్ గెస్ట్ ఇన్విటేషన్ ఇవ్వడం పవర్‌స్టార్‌కే సాధ్యమంటూ ఫ్యాన్స్ ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు.

