యంగ్ హీరో నితిన్ కు ఈ యేడాది ఏమంతగా అచ్చిరాలేదు. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో వచ్చిన ‘చెక్’, ‘రంగ్ దే’ చిత్రాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోక పోవడం వల్ల అతని సొంత బ్యానర్ లో తెరకెక్కిన ‘మాస్ట్రో’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. అది కూడా వీక్షకులను పెద్దంత మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే నితిన్ సొంత బ్యానర్ లో నిర్మితమౌతున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ను వచ్చే యేడాది ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నట్టు శుక్రవారం ప్రకటించారు.
Read Also : 700 ఏళ్ళ నాటి ప్యాలెస్ లో స్టార్ కపుల్ పెళ్లి… జోరుగా ఏర్పాట్లు
చిత్రం ఏమంటే… వచ్చే యేడాది ఏప్రిల్ 29వ తేదీనే పవన్ కళ్యాణ్ తో క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల కాబోతోంది. తెలుగు సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ కు తాను వీరాభిమానని, ఆయనంటే ప్రాణమని నితిన్ చెబుతుంటాడు. పవన్ కళ్యాణ్, అలానే దర్శకుడు త్రివిక్రమ్ సైతం నితిన్ ను అంతే ప్రేమిస్తుంటారు. అతని సినిమాలను తమ వంతుగా ప్రమోషన్ చేస్తుంటారు. మరి అలాంటప్పుడు నితిన్ తన సినిమాను మెంటర్ పవన్ కళ్యాణ్ మూవీ మీదనే ఎలా విడుదల చేస్తాడనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. బహుశా ‘హరిహర వీరమల్లు’ మూవీ ఆ తేదీన విడుదల కాదనే నమ్మకంతోనే నితిన్ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారా? లేక ముందు ఓ తేదీ వేసేసి, ఆ తర్వాత నిదానంగా ముందుకో, వెనక్కో వెళ్దామని అనుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
