Site icon NTV Telugu

Naresh – Pavitra lokesh: లిప్ లాక్ తో కొత్త సంవత్సరానికి స్వాగతం!!

Np

Np

Naresh: సీనియర్ నటుడు నరేశ్‌ ముచ్చటగా నాలుగో పెళ్ళికి రెడీ అయిపోయాడు. ఇప్పటికే మూడు సార్లు వివాహం చేసుకుని, విడాకులు తీసుకున్న నరేశ్… గత కొంతకాలంగా నటీ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన ప్రస్తుత భార్య రమ్యతో వివాదమూ సాగుతోంది. ఆ మధ్య బెంగళూరుకు నరేశ్, పవిత్ర లోకేష్ వెళ్ళినప్పుడు రమ్య రఘుపతి తన స్నేహితులతో కలిసి వెళ్ళి, హోటల్ లో హల్చల్ చేసింది. పోలీసుల సాయంతో నరేశ్, పవిత్ర లోకేష్ అక్కడ నుండి బయట పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొంతకాలంగా తాను రమ్యకు దూరంగా ఉంటున్నానని, ఆమెతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని నరేశ్ ఆ మధ్య స్పష్టం చేశారు. ఇక తాజాగా… పవిత్రా లోకేష్ ను త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలిపాడు.

కొత్త సంవత్సరం అందరకూ సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్టుగానే నరేశ్… తన నాలుగో పెళ్ళి విషయంలోనూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా శనివారం తెలిపారు. పవిత్రా లోకేశ్ తో కలిసి కేక్ కట్ చేసి, ఇద్దరూ ఒకరికి ఒకరు దానిని తినిపించుకున్నారు. పనిలో పనిగా లిప్ కిస్ ఇస్తున్న ఓ వీడియోనూ పోస్ట్ చేశారు. అందులోనే ‘న్యూ ఇయర్, న్యూ బిగినింగ్, నీడ్ యువర్ బ్లెసింగ్స్’ అని పేర్కొన్నారు. అతి త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నామని ఆ వీడియో చివరిలో నరేశ్, పవిత్ర లోకేష్ తెలిపారు. ఈ చిన్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుంటే… మరికొందరు నెగెటివ్ గా స్పందిస్తున్నారు. మరి ఈ విషయమై అతని భార్య రమ్య ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇంతకూ ఆమెకు నరేశ్ విడాకులు ఇచ్చాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version