Paruchi Gopala Krishna: టాలీవుడ్ సీనియర్ రచయితలు పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎన్నో హిట్లు వారి కలం నుంచి జాలువారినవే. ఇక పరుచూరి గోపాలకృష్ణ ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్పే మనస్తత్వం కలిగినవారు. తనకు సినిమా నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నిర్మొహమాటంగా నచ్చలేదని చెప్పేస్తారు. తాజాగా ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్3 సినిమాపై రివ్యూ ఇచ్చారు. సినిమా తనకు నచ్చలేదని, అసలు ఈ సినిమాలో వెంకటేష్ ఎలా నటించాడో అర్ధం కావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ” ఇటీవలే ఎఫ్ 3 సినిమా చూసాను. మొదటి ఎఫ్2 కూడా చూసాను. కానీ ఎఫ్ 2 లో ఉన్న సోల్ ఎఫ్ 3 లో లేదు. అందులో భార్యాభర్తల మధ్య పెత్తనం అందరిని ఆకర్షించింది. అయితే ఎఫ్ 3 లో అది లేదు. అనిల్ రావిపూడి.. గతంలో ‘శ్రీ కట్న లీలలు’ చిత్రంలో మేము చేసిన తప్పే చేశాడు. ఈ చిత్రం సెకండాఫ్ అసలు అర్థవంతంగా అనిపించలేదు.
మురళీ శర్మకు వెంకటేష్ కొడుకుగా నటించడం నప్పలేదు. తమన్నాకు మగవేషం వేయించి ఆ రొమాన్స్, కామెడీ సీన్స్ అర్ధం లేకుండా ఉన్నాయి. నిజం చెప్పాలంటే.. వెంకటేష్ ఏ సినిమానైనా కొద్దిగా లాజిక్ ఉంటేనే ఒప్పుకుంటాడు. మరి ఈ సినిమాను ఎలా ఒప్పుకున్నాడో అర్ధం కావడం లేదు. కుటుంబం మొత్తం హోటల్ లో పనిచేస్తుంటే.. మెహరీన్ వేరే ఇంట్లో పనిమనిషిగా పనిచేయడం అంతగా నచ్చలేదు. ఏదిఏమైనా ఈ సినిమాను చివరి 20 నిమిషాలే బతికించింది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
