Mahith Narayan: యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన సినిమా ‘పరారి’. సాయి శివాజీ దర్శకత్వంలో జి.వి.వి. గిరి నిర్మించిన ఈ సినిమా పోస్టర్ ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, టీజర్ ను నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత గిరి మాట్లాడుతూ, ”ఒక లక్యంతో ఈ సినిమాని నిర్మించాను. చక్రి తమ్ముడు మహిత్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నేను సుమన్ గారి అభిమానిని. ఆయన వందవ సినిమా మేము చెయ్యాలి. కానీ అది అవ్వలేదు. ఈ మూవీలో సుమన్ మంచి క్యారెక్టర్ చేశారు. అలీ, షయాజి షిండే, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 30న సినిమాను విడుదల చేయబోతున్నాం. మంచి కథ కథనాలతో తెరకెక్కిన చిత్రమిది” అని అన్నారు. మహిత్ నారాయణ్ మాట్లాడుతూ, ”నిర్మాత గిరి గారి అబ్బాయి యోగేశ్వర్ అనుభవం ఉన్న నటుడిలా తన పాత్రను పోషించాడు. పాటలు అన్ని బాగా వచ్చాయి. ఈ సినిమా ద్వారా నాకు మంచి పేరు వస్తుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన బసిరెడ్డి, దామోదర ప్రసాద్, జె.జె. ప్రకాశ్, శక్తి పిక్చర్స్ రమేశ్ తదితరులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘గరుడవేగ’ అంజి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు స్వర్గీయ గౌతమ్ రాజు కూర్పరి. ఇందులోని పాటలను రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్ రాశారు. నందు యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు.