డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయి ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’ సీజన్ 2 వచ్చేసింది. జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్ నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సీరీస్ లో నటించిన తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు నటుడు శరత్ కుమార్. ‘కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్ చాలా చేశా. గ్యాప్ తర్వాత గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ ఈ వెబ్ సిరీస్ లో చేశా. ఇందులో నాయుడు అనే పాత్రలో కనిపిస్తాను. అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉన్న వెబ్ సిరీస్ ఇది. ఒక్కో సందర్భంలో ఒక్కో పాత్ర హైలైట్ అవుతుంది’ అని చెబుతున్నారు శరత్ కుమార్. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా కోసం నాలుగేళ్లు గెడ్డం లుక్ మెయింటైన్ చేయల్సివచ్చిందని, అదే గెటప్ లో ఈ వెబ్ సిరీస్ లో నటించానని అన్నారు. ఇంకా మాట్లాడుతూ ‘తొలిసారి చేసిన వెబ్ సిరీస్ కు ఆదరణ దక్కటం సంతోషంగా ఉంది. థియేట్లలో సినిమా బాగుందా బాగా లేదా అని కలెక్షన్స్ చెబుతాయి. ఓటీటీలో కంటెంట్ బాగుందా? లేదా అన్నది సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చెబుతుంటాయి. బడ్జెట్ పరిమితుల్లో మంచి కథను చెబితే వెబ్ సిరీస్ కు కూడా మంచి లాభాలు వస్తాయి. పరంపర 2 లో నటనకు అవకాశం ఉంది కాబట్టి ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది.
సినిమాల్లో విలన్ అర్థం మారిపోయింది. చూపించే విధానం ఛేంజ్ అయ్యింది. మంచి వాళ్లు, చెడ్డ వాళ్లు అనేది ఆలోచించే కోణంలో ఉంటుంది’ అని తెలిపారు. తను ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నానంటూ మంచి ప్రభుత్వం కావాలంటే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నట్లే రాజకీయాల్లో ఉండటమూ బాధ్యతగా భావిస్తానంటున్నారు శరత్. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ‘వారుసుడు’లో నటిస్తున్నానని, ‘పొన్నియన్ సెల్వన్’ విడుదలకు సిద్ధంగా ఉందని, అలాగే లారెన్స్ సినిమాలో విలన్ గా నటిస్తున్నానని తెలుపుతూ తమ ఇంట్లో నటీనటులు పలువురు ఉన్నా ఎవరి సినిమాల ఎంపిక వారిదే అని స్పష్టం చేశారు శరత్ కుమార్.