మహానటుడు ఎన్టీయార్ కేవలం నటనకే పరిమితం కాలేదు. చిత్ర నిర్మాణంలోనూ చురుకుగా పాల్గొన్నారు. ఎన్.ఎ.టి., ఆర్కే ఎన్.ఎ.టి., రామకృష్ణ సినీ స్టూడియోస్, తారకరామ ఫిల్మ్ యూనిట్, రామకృష్ణ హార్టీ కల్చరల్ స్టూడియోస్, శ్రీమతి కంబైన్స్ వంటి పతాకాలపై పలు చిత్రాలు నిర్మించారు. ఆయన నట వారసుడు బాలకృష్ణ ఎన్.బి.కె. బ్యానర్ పైన ఎన్టీయార్ బయోపిక్ ను రెండు భాగాలుగా నిర్మించారు. అలానే హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో పలు చిత్రాలు నిర్మించాడు. ప్రస్తుతం కూడా రెండు మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే… ఎన్టీయార్ శతజయంతిని పురస్కరించుకుని మే 28వ తేదీ నందమూరి కుటుంబ సభ్యులు మరో కొత్త నిర్మాణ సంస్థకు శ్రీకారం చుట్టబోతున్నారు. బసవ తారకరామ క్రియేషన్స్ పతాకంపై నిర్మితం కాబోతున్న ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను నందమూరి బాలకృష్ణ తన తండ్రి జయంతి రోజున ప్రకటించబోతున్నాడు. నటరత్న ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ ఈ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించబోతున్నారని, రెండేళ్ళ క్రితం వివాహం చేసుకున్న తన కుమారుడు చైతన్యకృష్ణతో ఆయన సినిమా నిర్మించబోతున్నారని తెలుస్తోంది. కొన్నేళ్ళ క్రితం జగపతి బాబు ‘ధమ్’ మూవీలో చైతన్యకృష్ణ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత నటనకు దూరంగా ఉన్నాడు. మరి ఇప్పుడు మరోసారి సినిమాలలో నటించాలనే కోరిక చైతన్యకృష్ణకు ఎందుకు కలిగిందో తెలియదు.