Site icon NTV Telugu

MM Keeravani: స్టార్ హీరోస్ తో కీరవాణి సెంటిమెంట్!

Mm Keeravani

Mm Keeravani

చిత్రసీమ అంటేనే చిత్రవిచిత్రాలకు నెలవు. మూడు దశాబ్దాలకు పైగా చిత్రసీమలో తనదైన స్వరవిన్యాసాలతో అలరిస్తున్న ఎమ్.ఎమ్.కీరవాణి ఇప్పటి దాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం సమకూర్చలేదు. పాతికేళ్ళకు పైబడి కెరీర్ సాగిస్తున్న పవన్ సైతం కీరవాణి బాణీలతో సాగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే! ఎందుకంటే కీరవాణి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారినదే మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్రంతో. ఆ తరువాత స్టార్ హీరోస్ అందరి చిత్రాలకు కీరవాణి సంగీతం సమకూర్చారు. వాటిలో తొలిసారి కీరవాణి స్వరాలతో రూపొందిన స్టార్ హీరోస్ సినిమాలన్నీ ఘనవిజయాన్ని మూటకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు కీరవాణి బాణీలు కడుతున్న ‘హరిహర వీరమల్లు’ కూడా ఘనవిజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటి దాకా కీరవాణి సంగీతంతో రూపొందిన స్టార్ హీరోస్ సినిమాలేంటో ఓ సారి చూద్దాం. మహానటుడు యన్టీఆర్ చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’కు బాణీలు కట్టింది కీరవాణే! ఆ సినిమా ఘనవిజయం సాధించడమే కాదు, ఆడియో సైతం బిగ్ హిట్! నటసమ్రాట్ ఏయన్నార్ ‘సీతారామయ్యగారి మనవరాలు’కు కూడా కీరవాణి స్వరకల్పన చేశారు. ఆ సినిమా ఏయన్నార్ కెరీర్ లో చివరి సూపర్ హిట్ కావడం విశేషం! అంతకు ముందు ఏయన్నార్, రాజేంద్రప్రసాద్ ‘దాగుడుమూతల దాంపత్యం’కు కీరవాణి సంగీతం సమకూర్చినా అది సో సోగానే పోయింది. నిజానికి ‘సీతారామయ్యగారి మనవరాలు’కే కీరవాణి ముందుగా కమిట్ అయ్యారు. ఇలాంటిదే నటసింహ బాలకృష్ణతోనూ కీరవాణికి జరిగింది. ఎలాగంటే, బాలయ్య సినిమాకు కీరవాణి తొలుత కమిట్ అయింది ‘బొబ్బిలిసింహం’. కానీ, ‘గాండీవం’ ముందుగా రిలీజయింది. అది అంతగా అలరించలేదు. ‘బొబ్బిలిసింహం’ మాత్రం విజయగర్జన చేసింది. నాగార్జునకు కీరవాణి స్వరాలతో రూపొందిన తొలి చిత్రం ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’. ‘శివ’ తరువాత పలు ఫ్లాపులు చూసి, మళ్ళీ ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’తోనే హిట్ ట్రాక్ ఎక్కారు నాగ్. వీరందరి కంటే ముందే వెంకటేశ్ తో ‘క్షణక్షణం’ సినిమాకు పనిచేశారు కీరవాణి. ఈ సినిమా మ్యూజికల్ హిట్. మోహన్ బాబుతో కీరవాణి బాణీలు జోడీ కట్టిన తొలి చిత్రం ‘అల్లరి మొగుడు’ – సూపర్ హిట్. అలాగే రాజశేఖర్ ‘అల్లరి ప్రియుడు’కు కూడా కీరవాణి స్వరకల్పన చేయగా, అదీ సూపర్ హిట్టయింది.

తరువాతి తరం స్టార్ హీరోస్ అయిన జూనియర్ యన్టీఆర్ ‘స్టూడెంట్ నంబర్ వన్’, అల్లు అర్జున్ ‘గంగోత్రి’, ప్రభాస్ ‘ఛత్రపతి’, రామ్ చరణ్ ‘మగధీర’ చిత్రాలు సైతం కీరవాణి బాణీలతో రూపొందినవే. ఇవన్నీ ఆ యా హీరోలకు కీరవాణి తొలిసారి స్వరకల్పన చేసిన సినిమాలే! ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’కు కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉండడం అభిమానుల్లో ఆశలు రేకెత్తించడం సహజమే! అన్నట్టు మరో స్టార్ హీరో మహేశ్ బాబు సినిమాకు కూడా ఇప్పటి దాకా కీరవాణి స్వరకల్పన చేయలేదు. మరి మహేశ్ ఏ సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తారో! ఏది ఏమైనా కీరవాణి పని అయిపోయిందని కొందరు భావించినా, ‘బెస్ట్ సాంగ్’ కేటగిరీలో దేశానికే తొలి ఆస్కార్ అవార్డును అందించిన ఘనత కీరవాణికి దక్కింది. ఆస్కార్ అందుకున్న తరువాత కీరవాణి బాణీల్లో వస్తున్న స్టార్ హీరో సినిమా ‘హరిహర వీరమల్లు’ కానుంది. కాబట్టి సినీఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొనడంలో ఆశ్చర్యమేమీలేదు.

Exit mobile version