Prema desam: పాతికేళ్ళ క్రితం తమిళంలో విడుదలైన ‘కాదల్ దేశం’ తెలుగులో ‘ప్రేమదేశం’ పేరుతో డబ్ అయ్యి, ఇక్కడా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. కాలేజీ స్టూడెంట్స్ క్లాసులు బంక్ కొట్టి మరీ ఈ సినిమాను సక్సెస్ చేశారు. ఆ టైమ్ లో అమ్మాయిలు – అబ్బాయిలు ఎక్కడ గేదర్ అయినా… ‘ప్రేమదేశం’ పాటలను, అందులోని సన్నివేశాలను గురించి చర్చించుకునేవారు. అబ్బాస్, వినీత్, టబు ప్రధాన పాత్రలు పోషించిన ఆ సినిమా ఎ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ కారణంగా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడా సినిమా తెలుగు వర్షన్ ను సరికొత్త హంగులతో 9వ తేదీ మరోసారి విడుదల చేయబోతున్నారు. అప్పట్లో ప్రింట్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు సినిమాలన్నీ డిజిటల్ వర్షన్ లోనే ప్రదర్శితమౌతున్నాయి. దాంతో… ఈ సినిమాను డిజిటల్ గా కన్వర్ట్ చేసి, లేటెస్ట్ సౌండ్ సిస్టమ్ ను యాడ్ చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ‘ప్రేమదేశం’ ప్రేరణతో ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి.
అలానే తాజాగా త్రిగుణ్, మేఘా ఆకాశ్ జంటగానూ ఓ ‘ప్రేమదేశం’ మూవీ తెరకెక్కింది. చిత్రం ఏమంటే… పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ ‘ప్రేమదేశం’ సినిమాను నిర్మాతలు ఈ శుక్రవారం విడుదల చేయాలని భావిస్తున్నారు. సో… ఒకే రోజున అప్పటి ‘ప్రేమదేశం’, ఇప్పటి ‘ప్రేమదేశం’ రాబోతున్నాయన్న మాట. కథ పరంగా రెండు సినిమాలకూ ఎలాంటి సంబంధం లేకపోయినా, ప్రేక్షకులు మాత్రం ఒకదానితో మరొక దానిని పోల్చడం ఖాయం. మరి త్రిగుణ్, మేఘా ఆకాశ్ మూవీ ఏ మేరకు ఈ తరాన్ని మెప్పిస్తుందో, అప్పటి ‘ప్రేమదేశం’ను ఈ జనరేషన్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో వేచి చూడాలి!