OG 2 Heroine is Pooja Hegde or Preeti Mukundan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘ఓజీ 2’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించగా.. ఇప్పుడు సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారనే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి భాగంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించినప్పటికీ.. ఆమె పాత్రకు అక్కడే ముగింపు పలికింది. దాంతో సీక్వెల్‌లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఖాయమనే చర్చ జరుగుతోంది.
పూజా హెగ్డే పేరు:
ఓజీ 2 హీరోయిన్‌గా మొదట కాజల్ అగర్వాల్ పేరు వినిపించింది. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా తెలుగులో సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న పూజాకు ఈ సినిమా బిగ్ కంబ్యాక్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సోషల్ మీడియాలో మరో వర్గం మాత్రం బుట్టబొమ్మను తీసుకోవద్దని కామెంట్లు చేస్తోంది. ఇటీవల ఆమె నటించిన తెలుగు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడం, ప్రస్తుతం ఫామ్‌లో లేకపోవడాన్ని కారణంగా చూపుతూ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
‘కన్నప్ప’ బ్యూటీకి సపోర్ట్:
ఓజీ 2 హీరోయిన్‌గా యువ నటి ప్రీతి ముకుందన్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన ‘బ్లాస్ట్’ చిత్రంలో తన అందం, నటనతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్న ప్రీతిని ఓజీ 2లో హీరోయిన్‌గా తీసుకోవాలని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో మేకర్స్‌కు సూచిస్తున్నారు. పవన్‌కు జోడీగా ఆమె కొత్త ఫ్రెష్ లుక్‌లో కనిపిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్-పూజా కాంబో కుదురుతుందా?:
గతంలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి మొదట పూజా హెగ్డేను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఆ స్థానంలో శ్రీలీలను తీసుకున్నారు. దీంతో ఈసారి అయినా పవన్-పూజా కాంబినేషన్‌ను సుజీత్ సెట్ చేస్తాడా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం ఓజీ 2 హీరోయిన్ విషయంలో అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయినప్పటికీ రోజుకో హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై మరింత హైప్‌ను పెంచుతోంది. చివరకు సుజీత్ ఎవరిని ఎంపిక చేస్తాడో, మేకర్స్ ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారో చూడాల్సి ఉంది.

