NTV Special Story on Police Brother Movie.
అనుమోలు వెంకటసుబ్బారావు అంటే ఎవరికీ అంతగా తెలియదు. కానీ, ఏ.వి.సుబ్బారావు అంటే ఓ ప్రముఖ నిర్మాత అని కొందరికి తెలియవచ్చు. అయితే, ‘ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్’ అధినేత ఏ.వి.సుబ్బారావు అంటే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. 1953లో ఎల్వీ ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘పెంపుడు కొడుకు’ చిత్రంతో ఏ.వి.సుబ్బారావు నిర్మాతగా మారారు. తరువాత ఏయన్నార్ తో నిర్మించిన ‘ఇల్లరికం’ ఘనవిజయం సాధించింది. ఆ పై ‘ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్’సంస్థకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. ఏయన్నార్, బాలకృష్ణ, కృష్ణంరాజు, నరసింహరాజు హీరోలుగా చిత్రాలు నిర్మించి అలరించారు సుబ్బారావు. ‘ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్’ పతాకంపై నిర్మితమైన చివరి తెలుగు చిత్రంగా ‘పోలీస్ బ్రదర్స్’ నిలచింది. మోహన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోలీస్ బ్రదర్స్’ ద్వారానే పోసాని కృష్ణమురళి రచయితగా పరిచయం అయ్యారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడు శ్రీ ఈ సినిమాతోనే సంగీత దర్శకుడయ్యారు. వినోద్ కుమార్, చరణ్ రాజ్ నటించిన ‘పోలీస్ బ్రదర్స్’ 1992 జూలై 4న జనం ముందు నిలచింది. మంచి విజయం సాధించింది.
ఇంతకూ ఈ ‘పోలీస్ బ్రదర్స్ ‘ కథ ఏమిటంటే – మంచిన వారిపాలెంలో సత్యం, సాంబ అన్నదమ్ములు ఉంటారు. వారిద్దరికీ పోలీస్ ఉద్యోగం వస్తుంది. వారి తండ్రి దశరథరామయ్య పొంగిపోతాడు. జనానికి సేవ చేసే పోలీస్ ఉద్యోగం వచ్చిందని, తమ ఊరి పేరు నిలుపుతూ ఉద్యోగం చేసుకోవాలని చెబుతాడు. వారిద్దరి పేర్లు పేపర్ లో వచ్చేలా పనిచేయాలని అంటాడు తండ్రి. అన్నదమ్ముల్లో సాంబ ట్రాఫిక్ పోలీస్ గానూ, తమ్ముడు సత్యం స్టేషన్ కానిస్టేబుల్ గానూ చేరతారు. జీవరత్నం అనే వాడు బ్లాక్ టిక్కెట్స్ అమ్ముతూ, డబ్బు కోసం ఏదైనా చేస్తూ ఉంటాడు. ఆ ఊరిలో పేరు మోసిన దాదా కన్నారావు అనే అతని బస్ ఓవర్ లోడ్ తో పోతూ ఉంటే, ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ఉన్న సాంబ కేసు బుక్ చేస్తాడు. కన్నారావు పిలిచి మరీ సాంబకు పార్టీ ఇచ్చి, మందు అలవాటు చేస్తాడు. కన్నారావు తమ్ముడు చిన్నాను బాంబుల కేసులో అరెస్ట్ చేస్తాడు సత్యం. కానీ, ట్రాఫిక్ లో ఉండే సాంబ వచ్చి, చిన్నాను తాను ట్రాఫిక్ ఐలాండ్ ను గుద్దిన కేసులో అరెస్ట్ చేశానని కోర్టులో వాదిస్తాడు. జేబులు కొట్టి జీవించే కనకదుర్గ మాత్రం తాను చిన్నాను సత్యం అరెస్ట్ చేయడం చూశానని సాక్ష్యం చెబుతుంది. కానీ, మిగిలిన సాక్ష్యాలన్నీ చిన్నాకు అనుకూలంగా మారడంతో అతను ఫైన్ కట్టి విడుదలవుతాడు. చివరకు అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తుతాయి. అన్నదమ్ములను చూడవచ్చిన దశరథ రామయ్యకు సాంబ అవినీతి పరుడని తేలుతుంది. “నిన్నటి దాకా నాకు ఇద్దరు కొడుకులు. ఇప్పుడు ఒక్కడే. నువ్వు కూడా అవినీతికి పాల్పడితే నాకు బిడ్డలే పుట్టలేదనుకుంటా” అని సత్యంతో చెప్పి దశరథరామయ్య ఊరెళ్ళిపోతాడు. సత్యం, కనకదుర్గను పెళ్ళాడవలసి వస్తుంది. కన్నారావు తమ్ముళ్ళు అచ్చు గుద్దినట్టుగా ఉండే కవలలు ఓ ప్రైవేట్ బ్యాంక్ యజమానిని చంపేస్తారు. అదే బ్యాంకులో పోలీస్ బ్రదర్స్ ఖాతా తెరచి ఉంటారు. దాంతో వారిద్దరికీ ఈ బ్యాంక్ దంపతులతో అనుబంధం ఏర్పడి ఉంటుంది. ఆమెకు అండగా నిలబడతారు అన్నదమ్ములు. కన్నారావు తమ్ముళ్ళు జైలుకు వెళతారు. కానీ, కన్నారావు దయతో ఎంపీ స్థాయికి ఎదిగిన జీవరత్నం వారికి బెయిల్ ఇప్పిస్తాడు. తన కూతురుతో ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరికి పెళ్ళి చేయాలని అంటాడు ఎంపీ జీవరత్నం. సరే నంటాడు కన్నారావు. అయితే కన్నా తమ్ముళ్ళు గర్భవతి అయిన కనకదుర్గను పొడిచేసి, ఆమెకు గర్భస్రావం అయ్యేలా చేస్తారు. దాంతో ఆ కవలసోదరుల్లో ఒకనికి మగతనం తీసేస్తాడు సాంబ. తన మరదలికి అన్యాయం చేసినందుకు ఇలా చేశాననీ టేప్ రికార్డ్ లో వినిపిస్తాడు. సాంబను చంపిస్తాడు కన్నారావు. సాంబ ఆత్మకు శాంతి చేకూరేలా సత్యం కన్నారావును చంపేస్తాడు. పోలీస్ బ్రదర్స్ పేర్లు పేపర్ లో పడడం చూసిన తండ్రి దశరథరామయ్య పొంగిపోతూ ఆ పేపర్ పట్టుకొని పిచ్చెక్కినట్టు తిరుగుతూ ఉండడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో సత్యంగా వినోద్ కుమార్, సాంబగా చరణ్ రాజ్, దశరథ రామయ్యగా అట్లూరి పుండరీకాక్షయ్య నటించారు. రోజా, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, దేవన్, మనోరమ, ఢిల్లీ గణేశ్, కవల సోదరులు గోరింట రామరాజు, గోరింట లక్ష్మణరాజు, జ్యోతి, కృష్ణవేణి, సాక్షి రంగారావు, పరుచూరి వెంకటేశ్వరరావు నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు పోసాని కృష్ణమురళి సమకూర్చారు. వేటూరి, సాహితీ పాటలు రాయగా, శ్రీ బాణీలు కట్టారు. “సుడిలో దూకాలి… ఎదురే ఈదాలి…”, “అబ్బా అబ్బా… లబ్బో దిబ్బో…” అనే పాటలు ఆకట్టుకున్నాయి.
‘పోలీస్ బ్రదర్స్’ తెలుగునాట మంచి విజయం సాధించింది. ఈ సినిమాను హిందీలో తాతినేని రామారావు దర్శకత్వంలో ‘ముకాబ్లా’గా నిర్మించారు ఏ.వి.సుబ్బారావు. తెలుగులో మాత్రం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ చివరి చిత్రంగా నిలచింది ‘పోలీస్ బ్రదర్స్’.