Site icon NTV Telugu

“ఎవరు మీలో కోటీశ్వరులు” అంటూ అదరగొట్టిన ఎన్టీఆర్, చరణ్

NTR and Ram Charan at Evaru Meelo Kotishwarulu Show

“ఎవరు మీలో కోటీశ్వరులు” షో మొదటి ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్మాల్ స్క్రీన్ కమ్ బ్యాక్ గేమ్ షో ఇది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోకు కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌లో మొదటి అతిథిగా రామ్ చరణ్ వచ్చారు. ఊహించినట్లుగానే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ తమ స్నేహంతో ఆకట్టుకున్నారు. స్టార్స్ ఇద్దరూ సూట్‌లు ధరించి స్మాషింగ్, కిల్లర్ లుక్ హ్యాండ్సమ్ గా కన్పించారు. షోలో ముందుగా షో లో రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా నుంచి సిడ్నీ నగరం సాంగ్ ని పాడి వినిపించాడు. అద్భుతంగా పాడారు అని ప్రశంసలు కురిపించిన ఎన్టీఆర్ త్వరలోనే ఒక సినిమాలో కూడా పాడాలని కోరారు. ఖచ్చితంగా అవకాశం వస్తే పాడతానని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ డ్రెస్ ను చరణ్ సర్దడం చూస్తుంటే “ఆర్ఆర్ఆర్”తో వారిద్దరి మధ్య స్నేహం మరింత పెరిగిందని అన్పిస్తుంది. తారక్ చరణ్‌తో “మీరు నా జీవితంలో నాకు తెలిసిన అత్యంత మంచి వ్యక్తి, బెస్ట్ ఫ్రెండ్” అని చెప్పడం దీనికి మరో నిదర్శనం.

“ఎవరు మీలో కోటీశ్వరులు” షోలో గేమ్ ఆడే ప్రముఖులందరూ తమ సంపాదనను స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తారు. అదే విషయాన్నీ ఎన్టీఆర్ చరణ్‌ని అడిగినప్పుడు “మా కుటుంబంలోని వారు తమ సంపాదనలో కొంత భాగాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వడం అలవాటు. ఎవరు మీలో కోటీశ్వరులు నుండి నా సంపాదన ట్రస్ట్‌కు వెళ్తుంది. దాని ద్వారా పేద ప్రజలకు సహాయం అందుతుంది” అని చెప్పారు.

Read Also : పవన్ తో చరణ్ రిలేషన్… దిష్టి తగులుతుందట!

అయితే ఎన్టీఆర్ ఈ షోలో చరణ్ ను చాలా సులువైన ప్రశ్నలు అడిగాడు. ఇక ప్రశ్నల మధ్యలోనే చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఒక ప్రశ్నలో భాగమా రామ్ చరణ్ తన తండ్రితో తన సంబంధాన్ని పంచుకున్నాడు. “నా తండ్రి నాకు ఇంట్లో కూడా ఆచార్య” అని చెప్పగా “చిరంజీవి గారు నాకే కాదు మొత్తం పరిశ్రమకు ఆచార్యులు. చిన్నప్పటి నుండి అతడిని చూసి నేర్చుకోవడం నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది” అని తారక్ అన్నారు. అలాగే చిరంజీవితో “ఆచార్య” సినిమా షూటింగ్ అనుభవాలు చెప్పమని జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ని అడిగాడు. అయితే తనకు మామూలుగానే షూటింగ్ కి వెళ్లడం అంటే కొంచెం టెన్షన్ గా ఉంటుందని అలాంటిది నాన్నగారితో షూటింగ్ కి వెళ్లడం అంటే ప్రిన్సిపాల్ తో కూర్చుని పరీక్షలు రాస్తున్నట్లు అనిపించింది అని అన్నాడు. అయితే తాము పడ్డ కష్టమంతా తెరమీద కచ్చితంగా కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. “ఆచార్య” గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఎన్టీఆర్ అన్నాడు. ఇంకా ఈ షోలో “ఆర్ఆర్ఆర్” గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రేపు మళ్లీ ఎపిసోడ్ కొనసాగుతుంది. రామ్ చరణ్ ఇంకా గేమ్ ఆడుతున్నాడు. తదుపరి ఎపిసోడ్‌లో రానా దగ్గుబాటితో ఇంటరాక్ట్ అవుతాడు.

Exit mobile version