New Telugu Movie Titled Tara Launched: ‘సినిమా తార కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చిన ఓ బాలిక ఎన్ని కష్టాలు అనుభవించింది, చివరికు తన గమ్యాన్ని ఎలా చేరుకుంది’ అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘తార’. ‘కేరాఫ్ కంచర పాలెం’ ఫేమ్ కిషోర్ హీరోగా, సత్యకృష్ణ హీరోయిన్ గా, బేబీ తుషార, బేబీ నాగ హాసిని, మాస్టర్ హర్ష వర్ధన్, అజయ్ ఘోష్ ప్రధాన తారాగణంగా యం. బి. (మల్లి బాబు) ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పి. పద్మావతి సమర్పణలో వెంకట రమణ పసుపులేటి దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోస్ లో శుక్రవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, నటుడు, నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గూడ రామకృష్ణ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
చిత్ర దర్శకుడు మల్లిబాబు మాట్లాడుతూ, ”ఈ నెల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నాం. ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేస్తాం” అని అన్నారు. తమ బ్యానర్ నుండి చక్కని కంటెంట్ తో వస్తున్న నాలుగో చిత్రం ఇదని నిర్మాత పసుపులేటి వెంకట రమణ చెప్పారు. ఈ కార్యక్రమంలో కో-ప్రొడ్యూసర్ సాయిమల్లి అరుణ్ రామ్, జగన్, బాక్సాఫీస్ అధినేత చందు రమేశ్ తదితరులు పాల్గొని టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.