Site icon NTV Telugu

NetFlix : సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ కు నెట్‌ఫ్లిక్స్ షాక్?

Net Flix Siddu'

Net Flix Siddu'

ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాలు ఎక్కువగా పలు భాషల్లో విడుదల అవుతూ వస్తున్నాయి. గతంలో అయితే కొన్ని సినిమాల డబ్బింగ్ వెర్షన్ ఎప్పటికో విడుదలయ్యేవి. అందుకు కారణం వాటి రీమేక్, డబ్బింగ్ హక్కులు ఒరిజినల్ నిర్మాతల దగ్గర ఉండటమే. దానికి బెస్ట్ ఉదాహరణ ‘విక్రమ్ వేద’. దీనిని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయకపోవడానికి, రీమేక్ విషయంలో ఫెయిల్ అవడానికి కూడా ఇదే కారణం. అయితే హిందీ వెర్షన్ మాత్రం ఈ నెలాఖరున విడుదలకాబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల మలయాళంలో విడుదలైన ‘తల్లుమల’ సినిమా ఘన విజయం సాధించింది. ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయటానికి పలువురు ప్రయత్నించారు. యువహీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ కూడా అలా ప్రయత్నం చేసిన వారిలో ఉన్నారు.

ఈ హీరోలు పంపిన నిర్మాతలు హక్కులను సొంతం చేసుకునేందుకు ఆఫర్ చేసిన ఫిగర్స్ మరీ తక్కువ స్థాయిలో ఉండటంతో ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ నెట్‌ఫ్లిక్స్‌ వైపు దృష్టిసారించారు. టోవినో థామస్ నటించిన ‘తల్లుమల’ సాధారణ కథాంశంతో కూడినది అయినా ఎడిటింగ్, కథను చెప్పటంలో వైవిధ్యం వంటివి బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిపాయి. ఇక టోవినో థామస్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్‌లో చక్కటి ఆదరణ ఉండటంతో స్ట్రీమింగ్ సైట్ ఈ చిత్రాన్ని తమ ప్లాట్‌ఫారమ్‌లో అన్ని భాషలలో విడుదల చేయడానికి భారీ మొత్తాన్ని మేకర్స్‌కు ఆఫర్ చేసింది. దాంతో నిర్మాతలు సైతం తెలుగు రీమేక్ కోసం వేచి చూడకుండా నెట్ ఫ్లిక్స్ కే అమ్మేశారు. స్ట్రీమింగ్ సైట్ కూడా ఆలస్యం చేయకుండా అన్ని భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తోంది. ‘తల్లుమల’ మలయాళ వెర్షన్ 11వ తేదీ నుంచే అందుబాటులోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ చూపించిన స్పీడ్ కి మన హీరోలు కూడా షాక్‌తో బిత్తరపోయారు. ఏది ఏమైనా ముద్దొచ్చినపుడే చంక ఎక్కాలి. అంతే కానీ చూద్దాంలే అనుకుంటే వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చినట్లే. ఏమంటారు?

Exit mobile version