Siya Gautam: రవితేజా హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘నేనింతే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శియా గౌతమ్ ఉరఫ్ అదితి! ఆ తర్వాత క్రిష్ డైరెక్ట్ చేసిన ‘వేదం’లో ముస్లిం యువతిగా నటించి మెప్పించింది. ఇటు తెలుగుతో పాటు అటు కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించిన శియాకు ఆశించిన స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు. గత యేడాది ‘పక్కా కమర్షియల్’ మూవీలోనూ నటించిన శియా ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మరో మహాభారతం’లో నటిస్తోంది.
ఇంతకూ విషయం ఏమంటే… మూడు పదులు దాటిపోయిన ఈ బొద్దుగుమ్మ ఇటీవల పెళ్ళిపీటలెక్కేసింది. కానీ ఆ విషయాన్ని తన అభిమానులతో మాత్రం పంచుకోలేదు. ముంబైకి చెందిన పారిశ్రామిక వేత్త మిఖాయిల్ పాల్కీవాలాతో ఫిబ్రవరి 6వ తేదీ తన పెళ్ళి జరిగినట్టుగా సోషల్ మీడియా ద్వారా అమ్మడు తెలిపింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్ళికి భర్తతో కలిసి ప్రియమణి హాజరు కావడం విశేషం. శియా గౌతమ్, ప్రియమణి మధ్య అనుబంధం గురించి పెద్దంతగా ఎవరికీ తెలియదు. ఏదేమైనా… నిరాడంబరంగా పెళ్లి చేసేసుకుని ‘నేనింతే’ అని చాటి చెప్పింది శియా గౌతమ్.