‘పూలరంగడు, చుట్టాలబ్బాయి’ లాంటి వినోదప్రధాన చిత్రాలను తెరెక్కించిన వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ‘మత్తు వదలారా, సేనాపతి’ సినిమాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా నబిషేక్, తూము నర్సింహా పటేల్ ‘దిల్ వాలా’ అనే సినిమా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ క్లాప్ ఇవ్వగా, హీరో అల్లరి నరేష్ స్క్రిప్ట్ ని అందించారు. ప్రముఖ హాస్యనటుడు అలీ కెమరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా వీరభద్రం చౌదరి మాట్లాడుతూ, ”నేను కథ చెప్పగానే అంగీకరించిన నరేష్ అగస్త్యకి థాంక్స్. శ్వేత అవస్తి మంచి నటి. ‘మెరిసే మెరిసే’ సినిమా చూసి శ్వేతని హీరోయిన్ గా తీసుకున్నాను. నా ‘పూలరంగడు’ చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ దీనికి వర్క్ చేస్తున్నారు. డీవోపీ అనిత్ నాకు చాలా కాలంగా తెలుసు. అందరూ మంచి టెక్నిషియన్స్ ఈ చిత్రంలో పని చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ కీలకమైన పాత్రను నటకిరీటి రాజేంద్రప్రసాద్ పోషిస్తున్నారు. సెప్టెంబర్ లో సినిమా షూటింగ్ మొదలుపెడతాం” అని అన్నారు. నరేష్ అగస్త్య మాట్లాడుతూ, ”వీరభద్రం చౌదరి గారు కథ చెప్పిన తర్వాత మూడు రోజుల్లోనే సినిమా ఓకే చేశాను. ఈ మూవీ కోసం ఎక్కడా రాజీపడకుండా వందశాతం నా వర్క్ ని ఇస్తా. మొదటిసారి ఒక కమర్షియల్ సినిమా చేయబోతున్నాను” అని అన్నారు. అలీ రజా మాట్లాడుతూ, ”మంచి క్రైమ్ కామెడీతో మీ ముందుకు రాబోతున్నాం. నరేష్, నేను పదేళ్ళు తర్వాత కలసి పని చేయబోతున్నాం. 2013లో అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరభద్రం చౌదరి గారు షూటింగ్ లో వున్నప్పుడు ఒక అవకాశం కోసం ఇవ్వమని అడిగేవాళ్ళం. ఎట్టకేలకు ఆయన సినిమాలో అవకాశం దొరికింది” అని అన్నారు.
