Site icon NTV Telugu

Nani : నాని స్టార్ హీరో అనిపించుకోలేడా!?

Nani

Nani

చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన టాలెంట్ తో హీరోగా రాణించి మీడియమ్ రేంజ్ హీరోగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు నాని. నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని స్టార్ హీరో అనిపించుకోవడం ఇక నల్లేరుబండి మీద నడకే అనుకున్నారు ఒకప్పుడు. అయితే అది ఇప్పుడు ఎండమావిగానే మిగిలిపోతుందనిపిస్తోంది. మీడియమ్ రేంజ్ హీరోలుగా ఉన్న వారిలో ముందువరుసలో ఉన్నప్పటికీ అక్కడనుంచి ఓ మెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రం విజయవంతం కావటం లేదు. కెరీర్ ఆరంభంలో ‘అష్టా చెమ్మ, రైడ్, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమిందార్, ఈగ’ అంటూ తన ఇమేజ్ ని అంగుళం అంగుళం పెంచుకుంటూ పోయాడు. ఆ తర్వాత ‘ఎటో వెళ్ళిపోయింది మనసు, పైసా, ఆహా కళ్యాణం, జెండాపై కపిరాజు’తో కెరీర్ డౌన్ చేసుకున్నాడు. మళ్ళీ ‘ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, జెంటిల్ మేన్, నేను లోకల్, నిన్నుకోరి, మిడిల్ క్లాస్ అబ్బాయ్’ వరకూ అలా అలా స్టార్ డమ్ ని ఒక్కో మెట్టు ఎక్కించుకుంటూ వచ్చాడు. మధ్యలో ఒకటి రెండు ప్లాఫ్స్ వచ్చినా అవి తన ఇమేజ్ ని డామేజ్ చేయలేకపోయాయి.
దాంతో ఇక నాని స్టార్ హీరోల రేంజ్ కి ఎదగటం ఖాయం అనే అనుకున్నారు అందరూ. అయితే ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ తర్వాత నానిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగి ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారాయో ఏమో కానీ సరైనా సినిమా ఒక్కటీ పడలేదు. పైగా నాని పారితోషికంతో పాటు సినిమాల బడ్జెట్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. దీంతో నాని సినిమాల బయ్యర్ల నుంచి సినిమా హాల్ ఓనర్స్, నిర్మాతలు, ఓటీటీ కొనుగోలుదారుల వరకూ ఏ ఒక్కరికీ పెట్టిన రూపాయికి రూపాయి తిరగి రావటం గగనం అయిపోయింది. చాలా వరకూ నష్టాలే మిగిలాయి. లేటెస్ట్ గా వచ్చిన ‘అంటే సుందరానికి’ సైతం పర్వాలేదనే టాక్ వచ్చినా వసూళ్ళు మాత్రం అంతంత మాత్రమే. దీని ప్రభావం రాబోయే ‘దసరా’పై కూడా పడిందని టాక్. దీంతో స్టార్ హీరో రేంజ్ కి ఎదగవలసిన ఇమేజ్ సెకండ్ గ్రేడ్ హీరోగా ఎదిగిన స్థాయిని కాపాడుకోవడం కష్టంగా మారింది. తన రేంజ్ హీరోల్లో రామ్, విజయ్ దేవరకొండ కూడా ప్లాప్స్ తో తప్పటడుగులు వేస్తున్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే నానిని దాటి ముందుకు వెళ్ళేవారే. ఇక నాగచైతన్యకు వరుస హిట్స్ దక్కినా సూపర్ సక్సెస్ ఏదీ దరి చేరలేదు. ఇకనైనా నాని సరైన ప్రాజెక్ట్ లు ఎంపిక చేసుకోకుంటే స్టార్ హీరో మాట దేవుడెరుగు గ్రేడ్ 2 హీరో రేంజ్ కే ఎసరు వస్తుందనటంలో సందేహం లేదు. సో బి కేర్ ఫుల్ నాని.

Exit mobile version