HER Chapter 1: సుశాంత్ హీరోగా నటించిన ‘చి.ల.సౌ.’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. ఆ తర్వాత కూడా కెరీర్ పరంగా విలక్షణ కథలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది. ‘హిట్’ సినిమాలో తన టాలెంట్ బయటపెట్టి సక్సెస్ అందుకున్న రుహాని… అదే బాటలో ఇప్పుడు ‘హర్’ అనే ఓ వైవిధ్యభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటిదాకా సాఫ్ట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకున్న రుహానీ శర్మ, తొలిసారి ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ చేస్తూ, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. టీజర్ విడుదల అనంతరం చిత్ర బృందానికి నాని అభినందనలు తెలిపారు.
ఈ టీజర్ లో రుహానీ శర్మ క్యారెక్టర్ హైలైట్ గా వుంది. ఆమె చాలెంజింగ్ రోల్ చేసిందనేది ఈ టీజర్ చూస్తుంటే అర్థమౌతోంది. డ్యూటీ పరంగా 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఓ హత్య కేసును ఛేదించడానికి తిరిగి ఖాకీ డ్రెస్ ధరించిన రుహానీ శర్మ సీన్ తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శ్రీధర్ స్వరగావ్ తెరకెక్కించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ పై ఈ టీజర్ తో అంచనాలు పెరిగాయి. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో వికాశ్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ బాణీలు కడుతున్నారు.
