నటనలోనే కాదు దర్శకునిగానూ తనదైన బాణీ పలికించారు యన్.టి.రామారావు. ప్రపంచంలో మరెవ్వరూ చేయని విధంగా తాను దర్శకత్వం వహించిన చిత్రాలకు టైటిల్ కార్డ్స్ లో పేరు వేసుకోరాదని భావించారు యన్టీఆర్. దర్శకునిగా ఎవరి పేరూ వేయలేదంటే ‘ఈ సినిమాకు యన్టీఆర్ దర్శకత్వం వహించారు’ అని జనమే భావించాలని ఆశించారు. ఆ కారణంగానే యన్టీఆర్ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సీతారామకళ్యాణం’ (1961), రెండో సినిమా ‘గులేబకావళి కథ’ (1962)కు టైటిల్ కార్డ్స్ లో దర్శకునిగా పేరు వేసుకోలేదు. ఈ రెండు సినిమాల్లో దర్శకులుగా ఎవరి పేరూ ప్రకటించలేదు. కేవలం ఆ నాటి పత్రికల ద్వారానే ఈ రెండు చిత్రాలకు యన్టీఆర్ దర్శకత్వం వహించారని జనానికి తెలిసింది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ సమయంలో యన్టీఆర్ మెగాఫోన్ పట్టిన ఛాయాచిత్రాల వల్లే ఆయన దర్శకత్వం వహించారనీ తెలుసుకున్నారు. అంతకు మించిన సమాచారమేదీ లేదు. ఈ విషయం తెలిసిన సీనియర్ డైరెక్టర్స్ సి.పుల్లయ్య, పి.పుల్లయ్య ఇద్దరూ యన్టీఆర్ ను మందలించారు. ‘డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్’ అలాంటిది, ఆ పేరునే విస్మరించడం మంచిది కాదని, అలా చేస్తే నీకు గర్వం తలకెక్కిందనీ జనం భావించే అవకాశం ఉందని సూచించారు. దాంతో వారి మాటకు గౌరవమిస్తూ యన్టీఆర్ తాను తెరకెక్కించిన మూడో చిత్రం ‘శ్రీక్రిష్ణపాండవీయం’ (1966) చిత్రం నుండి దర్శకునిగా టైటిల్స్ లో తన పేరు వేసుకున్నారు. ఇక్కడ కూడా సినిమా టైటిల్ పడగానే, దర్శకునిగా పేరు వేసుకోవడం మొదలెట్టారు. అలా రామారావు దర్శకునిగానూ తనదైన శైలిని ప్రదర్శించారు. విశేషమేమంటే, ఆయన దర్శకత్వంలో రూపొందిన ఐదు చిత్రాలు వరుసగా విజయం సాధించి, శతదినోత్సవాలు చూశాయి.
యన్టీఆర్ ను ఎక్కువ చిత్రాలలో దర్శకత్వం వహించిన డైరెక్టర్ ఎవరంటే, యన్టీఆర్ అనే చెప్పాలి. మొత్తం 18 చిత్రాలకు యన్టీఆర్ దర్శకత్వం వహించారు. వీటిలో ‘శ్రీక్రిష్ణపాండవీయం’ తమిళ వర్షన్ ‘కన్నన్ కరుణై’ (1971), హిందీ చిత్రం ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ (1993) కాగా, మిగిలిన 16 తెలుగు చిత్రాలు. అవి “సీతారామకళ్యాణం (1961), గులేబకావళి కథ (1962), శ్రీక్రిష్ణపాండవీయం (1966), వరకట్నం (1969), తల్లా-పెళ్ళామా (1970), తాతమ్మకల (1974), దానవీరశూర కర్ణ (1977), చాణక్య-చంద్రగుప్త (1977), అక్బర్ సలీమ్ అనార్కలి (1978), శ్రీరామపట్టాభిషేకం (1978), శ్రీమద్విరాటపర్వము (1979), శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం (1979), చండశాసనుడు (1983), శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984), బ్రహ్మర్షి విశ్వామిత్ర (తెలుగు) (1991), సమ్రాట్ అశోక (1992)”
దర్శకునిగానూ యన్టీఆర్ బాణీ ప్రత్యేకమైనది. తన గురువులు కేవీ రెడ్డి, బి.యన్.రెడ్డి బాటలో పయనిస్తూ ఎక్కడా ముడి ఫిలిమ్ ను వ్యర్థం చేయకుండా ప్రణాళిక వేసుకొని మరీ చిత్రీకరణ జరిపేవారు యన్టీఆర్. వరుసగా ఐదు చిత్రాలతో దర్శకునిగా విజయం సాధించిన యన్టీఆర్ ఆరవ సినిమా ‘తాతమ్మకల’తో ఓ సంచలనం సృష్టించారు. 1974లో విడుదలైన ఆ చిత్రంలో ‘కుటుంబనియంత్రణ’ను వ్యతిరేకిస్తూ కొన్ని సంభాషణలు చొప్పించారు. దాంతో ప్రభుత్వం ఆ సినిమాను నిషేధించాలని భావించింది. తరువాత అదే చిత్రానికి మరికొన్ని మార్పులూ చేర్పులూ చేసి, మళ్ళీ విడుదల చేశారు. అలా ఒక సినిమాను రెండు విధాలుగా తీసి విడుదల చేయడం ఓ విశేషంగా నిలచింది. ఇక బహుమతి పొందిన చిత్రాలకు అప్పట్లో కేంద్రప్రభుత్వం పతకాలు మాత్రమే ప్రదానం చేసేది. ఉత్తమ చిత్రాలకు మరింత ప్రోత్సాహకంగా నగదు బహుమతిని 1970 అవార్డుల్లో ప్రవేశపెట్టింది కేంద్రం. అలా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును నగదు బహుమతితో అందుకున్న తొలి తెలుగు చిత్రంగా యన్టీఆర్ రూపొందించిన ‘వరకట్నం’ నిలచింది. ఇక యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన ఎనిమిదవ చిత్రం ‘దానవీరశూర కర్ణ’ ఓ చరిత్ర సృష్టించింది. అంతకు ముందు మరో దర్శకనటుడు రాజ్ కపూర్ తన ‘మేరా నామ్ జోకర్’ను 26 రీళ్ళతో, నాలుగు గంటల పదిహేను నిమిషాల ప్రదర్శన సమయంతో రూపొందించారు. తరువాత ఆ సినిమాను ట్రిమ్ చేసి, విడుదల చేశారు. దాంతో ఆ మూవీ మూడున్నర గంటలకు పరిమితమైంది. రామారావు తన ‘దానవీరశూర కర్ణ’ను 25 రీళ్ళతో, నాలుగు గంటల ఎనిమిది నిమిషాల ప్రదర్శనా కాలంతో తెరకెక్కించారు. అందునా ఇది పౌరాణిక చిత్రం కావడం గమనార్హం! ప్రస్తుతం భారతీయ చిత్రాలలో అతి నిడివిగల చిత్రంగా ‘దానవీరశూర కర్ణ’నే నిలవడం విశేషం! ఇక ఈ చిత్రంలో శ్రీకృష్ణ, కర్ణసుయోధన త్రిపాత్రాభినయం గురించి జనానికి కొత్తగా చెప్పవలసిన పనిలేదు. ఈ సినిమా హైదరాబాద్ లో 250 రోజులకుపైగా ప్రదర్శితమైంది.
యన్టీఆర్ దర్శకునిగా తన సమకాలికులైన ఏయన్నార్, శివాజీగణేశన్ ను కూడా తన ‘చాణక్య-చంద్రగుప్త’లో దర్శకత్వం వహించడం విశేషం! అలా ఆయన మల్టీస్టారర్ గా ‘చాణక్య-చంద్రగుప్త’ను తెరకెక్కించారు. హిందీలో ‘అనార్కలి’ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలిపిన సి.రామచంద్ర సంగీత దర్శకత్వంలో తన ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ని రూపొందించారు యన్టీఆర్. ఈ సినిమా ఆశించిన రీతిన ఆకట్టుకోలేకపోయినా, తెలుగునాట కూడా మ్యూజికల్ హిట్ గా నిలచింది. ఇందులో మహ్మద్ రఫీ గానం చేసిన పాటలు సంగీతప్రియులను ఎంతగానో అలరించాయి. శ్రీరాముడు ఎందుకంత గొప్పవాడు? అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన వ్యక్తిత్వాన్ని చిత్రీకరించారు వాల్మీకి. సుక్షత్రియుడైన రాముడు ఆ రోజుల్లోనే తనకు సాయం చేసిన వారందరినీ సోదరులుగా ఆదరించారు. ఆ అంశాలను తన ‘శ్రీరామపట్టాభిషేకం’లో వివరించారు యన్టీఆర్. ఇక అనితరసాధ్యంగా శ్రీకృష్ణ, అర్జున, బృహన్నల, సుయోధన, కీచక పాత్రలు పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో ‘శ్రీమద్విరాటపర్వము’ చిత్రాన్ని నిర్మించారు రామారావు. ఈ పౌరాణిక చిత్రాన్నీ ఈ నాటికీ జనం తలచుకుంటూనే ఉన్నారు. తనను శ్రీనివాసునిగా జనం మదిలో నిలిపిన ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రకథతోనే రంగుల్లో ‘శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ తెరకెక్కించారు. యన్టీఆర్ దర్శకత్వంలో మేనమామ, అల్లుడుగా ఆయనే నటించి, నిర్మించిన ‘చండశాసనుడు’ వసూళ్ల వర్షం కురిపించింది.
యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన చారిత్రక చిత్రం ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ లో బుద్ధ, శంకరాచార్య, రామానుజాచార్య, వేమన పాత్రలతో పాటు బ్రహ్మంగారి పాత్రనూ ధరించి అలరించారు. సినిమాలన్నీ ఫార్ములాతో సాగుతున్న ఆ రోజుల్లో డీగ్లామరైజ్డ్ బ్రహ్మంగారి పాత్రతో యన్టీఆర్ ఆ సినిమాతో అనూహ్య విజయం సాధించారు. ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాలలో శతదినోత్సవాలు చూడడమే కాదు. హైదరాబాద్ లో 250 రోజులకు పైగా ప్రదర్శితమయింది. 1984 నవంబర్ 29న విడుదలైన బ్రహ్మంగారి చరిత్ర అదే యేడాది డిసెంబర్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం విజయదుందుభి మోగించేలా చేసింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ హత్య కారణంగా సానుభూతి పవనాలు వీచి కాంగ్రెస్ పార్టీ దాదాపు 400 ఎంపీ సీట్లు సాధించింది. అయినప్పటికీ తెలుగునాట యన్టీఆర్ గాలి వీచి, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలతో కలసి 36 సీట్లు గెలిచింది. అందులో 30 సీట్లున్న తెలుగుదేశం పార్టీ అప్పట్లో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించే స్థాయి సంపాదించగలిగింది.
‘బ్రహ్మంగారి చరిత్ర’ ఘనవిజయాన్ని దృష్టిలో పెట్టుకొని యన్టీఆర్ తాను తెరకెక్కించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ను 1991 పార్లమెంట్ ఎన్నికల సమయంలో విడుదల చేశారు. అయితే మునుపటి మ్యాజిక్ సాగలేదు. ఈ సినిమాను హిందీలోనూ తెరకెక్కించారు. అయితే తెలుగు ఫలితం చూశాక ఈ చిత్రానికి కొన్ని మార్పులూ చేర్పులూ చేసి, హిందీలో తరువాత కొన్ని కేంద్రాలలో విడుదల చేశారు. యన్టీఆర్ దర్శకత్వంలో చివరగా రూపొందిన చిత్రం ‘సమ్రాట్ అశోక’. ఇందులో భానుమతి, బి.సరోజాదేవి వంటి ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీతలైన నటీమణులు నటించడం విశేషం! 1992లో యన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఏది ఏమైనా తెలుగునాట యన్టీఆర్ లాగా పౌరాణిక,జానపద,చారిత్రక, సాంఘికాలలో ఘన విజయాలు చూసిన మరో నటదర్శకుడు మనకు కానరాడు. దటీజ్ యన్టీఆర్!
ఇక యన్టీఆర్ దర్శకత్వంలో నటించి, స్టార్స్ గా రాణించిన వారూ ఉన్నారు. ‘సీతారామకళ్యాణం’లో శ్రీరామునిగా నటించిన హరనాథ్ ఆ తరువాత స్టార్ గా సాగడమే కాదు, మరికొన్ని పౌరాణిక చిత్రాలలో నటించడానికి ఆ సినిమాయే బీజం వేసింది. అదే చిత్రంలో లక్ష్మణునిగా నటించిన శోభన్ బాబు, తరువాత యన్టీఆర్ డైరెక్షన్ లో ‘శ్రీక్రిష్ణ పాండవీయం’లో అర్జునునిగా నటించారు. తరువాతి రోజుల్లో స్టార్ హీరోగా శోభన్ బాబు సాగిన తీరు అందరికీ తెలిసిందే. ఇక యన్టీఆర్ తనయుడు బాలకృష్ణ కూడా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలోనే నటునిగా ఓనమాలు దిద్దుకున్నారు. తరువాత హీరోగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న బాలకృష్ణ ఈ నాటికీ తన సత్తా చాటుకుంటూనే సాగుతున్నారు.
రామారావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సీతారామకళ్యాణం’ ద్వారానే ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్, ఆ పై దర్శకునిగా రాణించిన రవికాంత్ నగాయిచ్ పరిచయం అయ్యారు. తన ‘గులేబకావళి కథ’ చిత్రంతో జోసెఫ్-కృష్ణమూర్తిని సంగీతదర్శకులుగా పరిచయం చేసిందీ రామారావే. తెలుగు తెరకు కె.ఆర్.విజయ, భారతిని తన ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ ద్వారా పరిచయం చేశారు యన్టీఆర్. తాను త్రిపాత్రాభినయం చేసిన ‘దానవీరశూర కర్ణ’లో నటుడు చలపతిరావుతో శూత, ఇంద్ర, బ్రాహ్మణ, జరాసంధ, దృష్టద్యుమ్న పాత్రలు ధరింపచేసి ఆయనకు ఓ గుర్తింపు సంపాదించి పెట్టారు. అంతకు ముందు దుర్యోధనునిగా నటించిన సత్యనారాయణను తన ‘దానవీరశూర కర్ణ, శ్రీమద్విరాట పర్వము’ చిత్రాలలో భీమునిగా నటింప చేశారు రామారావు. మేటి నటీమణులు వాణిశ్రీ, శారద ఆయన దర్శకత్వంలో ద్రౌపది పాత్రను పోషించడం విశేషం!యన్టీఆర్ రూపొందించిన ‘చండశాసనుడు’లో పవర్ ఫుల్ రోల్ కనిపించిన తరువాతే శారద అనేక చిత్రాలలో ఆ తరహా పాత్రలు పోషించగలిగారు. కృష్ణకుమారి, ప్రభ, దీప, గీతాంజలి, చంద్రకళ, కాంచన, జయసుధ, జయప్రద, జయచిత్ర వంటివారు సైతం యన్టీఆర్ దర్శకత్వంలో మరపురాని పాత్రలు పోషించగలిగారు.
యన్టీఆర్ ఇద్దరు మహిళా దర్శకుల చిత్రాల్లో నటించారు. వారిద్దరూ ఆయన సరసన హిట్ పెయిర్స్ గా సాగిన మహానటీమణులే. వారే భానుమతి, సావిత్రి. వారిద్దరూ తరువాతి యన్టీఆర్ డైరెక్షన్ లో నటించడం విశేషం! ‘తాతమ్మకల, సమ్రాట్ అశోక’లో భానుమతి నటించగా, ‘వరకట్నం’లో సావిత్రి నటించారు. ఇక యన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘సీతారామకళ్యాణం’లోనూ, చివరి సినిమా ‘సమ్రాట్ అశోక’లోనూ నటించిన క్రెడిట్ నటి బి.సరోజాదేవికి దక్కుతుంది. ‘సీతారామకళ్యాణం’లో మండోదరిగా, ‘సమ్రాట్ అశోక’లో కర్మణిగా సరోజాదేవి నటించారు.