Nandamuri Kalyan Ram Birthday Special: నందమూరి నటవంశం మూడోతరం హీరోలు తాత యన్టీఆర్ బాటలో పయనించాలని నటులుగా మారారు. వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రత్యేకంగా నటనిర్మాతగా సాగుతున్నాడు. యన్టీఆర్ నటనిర్మాతగానూ పలు జనరంజకమైన చిత్రాలను నిర్మించారు. అదే తీరున ‘యన్.టి.ఆర్. ఆర్ట్స్’ బ్యానర్ నెలకొల్పి చిత్రాలను నిర్మిస్తూ నటిస్తున్నాడు కళ్యాణ్ రామ్.
నందమూరి కళ్యాణ్ రామ్ 1978 జూలై 5న హైదరాబాద్‌లో జన్మించాడు. యన్టీఆర్ మూడో కుమారుడు హరికృష్ణ తనయుడే కళ్యాణ్ రామ్. మహానటుడు యన్టీఆర్ నటవారసునిగా తొలుత తెరపై కనిపించింది హరికృష్ణనే. ఆయన నటవారసుడుగా మొదట తెరపై తళుక్కుమన్నది కళ్యాణ్ రామ్. తన బాబాయ్ బాలకృష్ణ నటించిన ‘బాలగోపాలుడు’ చిత్రంలో తొలిసారి నటించాడు కళ్యాణ్ రామ్. హైదరాబాద్ లోని సెయింట్ పాల్స్ లో పదో తరగతి దాకా చదివిన కళ్యాణ్ రామ్, విజయవాడ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్సియల్ స్కూల్ లోనూ చదివాడు. కొయంబత్తూర్ లో ఇంజనీరింగ్ చేసిన కళ్యాణ్ చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ చేశాడు. చదువయ్యాక ‘తొలి చూపులోనే’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ పై ‘అభిమన్యు’గానూ కనిపించాడు. ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. దాంతో తాత యన్.టి.ఆర్.పేరుపై బ్యానర్ నెలకొల్పి, తొలి ప్రయత్నంగా ‘అతనొక్కడే’ చిత్రాన్ని నిర్మించి, నటించాడు. ఈ సినిమా ద్వారా సురేందర్ రెడ్డిని దర్శకునిగానూ పరిచయం చేయడం విశేషం! ‘అతనొక్కడే’ చిత్రం మంచి విజయం సాధించడంతో కళ్యాణ్ రామ్ కూడా హీరోగా తనకంటూ ఓ స్థానం సంపాదించాడు.
‘అతనొక్కడే’ తరువాత ఇతర బ్యానర్స్ లోనూ కళ్యాణ్ రామ్ నటించాడు. “అసాధ్యుడు, విజయదశమి, లక్ష్మీ కళ్యాణం” వంటి చిత్రాల్లో అభినయించాడు కళ్యాణ్. అయితే అవేవీ అతను కోరుకున్న విజయాలను అందించలేకపోయాయి. మళ్ళీ సొంత బ్యానర్ లోనే వరుసగా చిత్రాలు నిర్మిస్తూ, నటిస్తూ సాగాడు కళ్యాణ్. “హరేరామ్, జయీభవ, కళ్యాణ్ రామ్ కత్తి, ఓమ్ 3డి, పటాస్” వంటి చిత్రాలు నిర్మించి, నటించాడు. తన సొంత చిత్రాల ద్వారా కొందరికి అవకాశాలూ కల్పించాడు కళ్యాణ్. ‘పటాస్’ ద్వారా అనిల్ రావిపూడిని దర్శకునిగా పరిచయం చేశాడు. ‘ఎమ్.ఎల్.ఏ.’ ద్వారా ఉపేంద్ర మాధవ్ కు తొలిసారి దర్శకునిగా అవకాశం కల్పించాడు.
తన సినిమాల్లో తానే హీరోగా నటించకుండా కూడా రవితేజతో ‘కిక్-2’, తమ్ముడు జూనియర్ యన్టీఆర్‌తో ‘జై లవకుశ’ వంటి చిత్రాలూ నిర్మించాడు కళ్యాణ్ రామ్. తాత యన్టీఆర్ బయోపిక్ లో తన తండ్రి హరికృష్ణ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు కళ్యాణ్. ‘ఎంత మంచివాడవురా’ తరువాత కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సూపర్ హిట్ కాగా ‘డెవిల్:ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ సినిమా ఫర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఆయన తన 21 సినిమాను ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాతో మళ్ళీ కళ్యాణ్ రామ్ తన సత్తా చాటుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. తాత యన్టీఆర్ బాటలో నటునిగా, నిర్మాతగా మారిన కళ్యాణ్ రామ్ ఆయనలా భవిష్యత్ లో దర్శకత్వం వహిస్తాడేమో చూడాలి.