Popcorn: సాయి రోనక్ హీరోగా, అవికా గోర్ హీరోయిన్గా ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘పాప్ కార్న్’. ‘నెపోలియన్’తో విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఆచార్య క్రియేషన్స్ అధినేత ఎం. భోగేంద్రగుప్తా ప్రొడక్షన్ నంబర్ 3గా దీనిని నిర్మిస్తున్నారు. అవికా స్క్రీన్ క్రియేషన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన అవికా గోర్, ఎం.ఎస్. చలపతిరాజు దీనికి సహ నిర్మాతలు. వాణిజ్య ప్రకటనల రంగంలో పద్దెనిమిదేళ్లు అనుభవం కలిగి, సొంతంగా ఓ యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న మురళీ నాగ శ్రీనివాస్ గంధం ‘పాప్ కార్న్’తో దర్శకుడిగా మారుతున్నారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమాను నిర్మించడానికి అవికా గోర్ ముందుకు వచ్చారు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా గురించి దర్శకుడు మురళీ నాగ శ్రీనివాస్ గంధం మాట్లాడుతూ “మెలోడ్రామా జానర్ లో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం కల ఓ అమ్మాయి, ఓ అబ్బాయి… తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో చిక్కుకుంటారు. అంతకు ముందు వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. తప్పించుకోవడానికి వీలు లేని చోటు ఆ ఇద్దరూ… ఎలా టైమ్ పాస్ చేశారు? ప్రమాదకరమైన పరిస్థితి వచ్చాక ఏం చేశారు? ఆ తర్వాత ఏమైందనేది కథ” అని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోందని, ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 10వ తేదీ సినిమాను విడుదల చేయబోతున్నామని నిర్మాత భోగేంద్ర గుప్తా తెలిపారు. జనవరి 4న ఈ మూవీ ట్రైలర్ ను కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదల చేస్తున్నామని, అక్కడ నుండి వినూత్న రీతిలో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.