మెగాస్టార్ ఇంటి ఆడపిల్లలకు జీ 5తో చక్కని అనుబంధమే ఏర్పడింది. అల్లు అరవింద్ సొంత ఓటీటీ సంస్థ ఆహా ఉన్నా, మొన్న చిరంజీవి కుమార్తె సుస్మిత తాను నిర్మించిన వెబ్ సీరిస్ ను జీ 5కే ఇచ్చారు. తాజాగా నాగబాబు కుమార్తె నిహారిక నిర్మించిన వెబ్ సీరిస్ సైతం జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. విశేషం ఏమంటే ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా మహేశ్ ఉప్పాల తెరకెక్కించిన ఈ వెబ్ సీరిస్ పేరు ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. నరేశ్, తులసీ, రాజీవ్ కనకాల, గెటప్ శ్రీను ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ”మనందరిదీ ఒక పెద్ద ఫ్యామిలీ. సినిమా ఫ్యామిలీ. కానీ ఈ దర్శకుడు మహేష్ ది చిన్న ఫ్యామిలీ అంట. మరి ఆ ఫ్యామిలీ ముచ్చట్లు చూడాలంటే, నవంబర్ 19 వరకూ వేచి ఉండాలి” అని అన్నారు. ఇక నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ, “ట్రైలర్ విడుదల చేసిన నాగార్జున గారికి చాలా చాలా థాంక్స్. మేం అడిగిన వెంటనే ఒప్పుకొన్నారు. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి వస్తే… ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్. కామెడీ డ్రామా అని చెప్పొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ నవ్వుకునేలా ఉంటుంది. సిరీస్‌లో ఐదు ఎపిసోడ్స్ ఉన్నాయి. ‘జీ 5’లో ఈ సిరీస్ విడుదల కానుండడం ఎంతో సంతోషంగా ఉంది” అని చెప్పారు. దర్శకుడు మహేష్ ఉప్పాల మాట్లాడుతూ “నాగబాబుగారి పుట్టినరోజు సందర్భంగా వెబ్ సిరీస్ టైటిల్ వెల్లడించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశాం. తర్వాత నాని గారు టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు నాగార్జున గారు ట్రైలర్ విడుదల చేశారు. మా సిరీస్ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసిన స్టార్ హీరోలకు థాంక్స్. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్… ప్రతిదానికి ప్రేక్షకుల స్పందన బావుంది. సిరీస్ కూడా ఆకట్టుకుంటుంది” అని చెప్పారు. మానసా శర్మతో కలిసి ఈ వెబ్ సిరీస్ కు మహేష్ ఉప్పాల కథ, మాటలు అందించారు.
