మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ గురించి అందరికి తెలిసిందే.. అభిమానుల కోరిక మేరకు ప్రజారాజ్యం అనే కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అనూహ్య పరిణామాలలో చిరు రాజకీయాలలో ఓటమి పాలయ్యారు. ఇక ఆ తరువాత రాజకీయాలు మనకు సరిపోవు అని సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక అన్న బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని ప్రారంభించి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. చిరు లా కాకుండా పవన్ మాత్రం గెలుపు ఓటమిలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమంలోనే తన జీవితాన్ని గడిపేస్తానని చెప్పుకొచ్చాడ. ఇక అన్న, తమ్ముళ్లకు ఎప్పుడు అండగా ఉంటాను అంటున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. ప్రస్తుతం నాగబాబు జనసేన విజయం కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలో పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన ఆయన ఓ హోటల్లో గురువారం మీడియాతో మాట్లాడారు.
ఇక ఈ సమావేశంలో చిరు పొలిటికల్ రీ ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ” చిరంజీవి గారు రాజకీయాల్లోకి రారు. రానున్న ఎన్నికల్లో ఆయన జనసేనకు మద్దతుగా ఉంటారు తప్ప పోటీ చేయరు. కళామతల్లి సేవలోనే చిరంజీవి ఉండనున్నారు. మెగా అభిమానులందరూ జనసేన వైపే ఉన్నారు. పొత్తులపై అన్నీ ఆలోచించి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్దంగానే ఉంటుంది. పవన్ పాదయాత్ర చేయడం లేదు కనై దాన్ని మించి ఉండేలా ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నాల్లో ఉన్నారు” అని చెప్పుకొచ్చారు. ఇక దీంతో చిరు సినిమాలకే పరిమితమవ్వాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి పోటీలో అయితే నిలబడకపోయినా కనీసం తమ్ముడు కోసం ప్రచారంలోనైనా కనిపిస్తాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.
