Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్‌ఫ్లేట్ అవుతున్నాయి’!

Naga Vamsi

Naga Vamsi

Box Office Numbers: సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోలు, నిర్మాతలు మాట్లాడే మాటలు కూడా సినిమా రిజల్ట్‌పై ప్రభావం చూపిస్తాయని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్‌లో తాను ఎలా మాట్లాడుతున్నాననే దాన్ని బట్టి ప్రేక్షకులు, ఫిల్మ్ బఫ్స్ సినిమా రిజల్ట్‌పై కొన్ని అంచనాలకు వస్తుంటారని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. తన ప్రమోషనల్ స్టైల్, మీడియాతో వ్యవహరించే తీరు, వివాదాస్పద ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కావాలని ఎవరినీ రెచ్చగొట్టేందుకు లేదా వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించనని స్పష్టం చేశారు. అయితే మీడియా నుంచి కాంట్రవర్సీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురైతే.. తనకు తెలిసిన విధంగా సమాధానం ఇస్తానని చెప్పారు. ఎవరైనా వెటకారంగా ప్రశ్నిస్తే, అంతే స్థాయిలో సమాధానం ఇవ్వడం తనకు అలవాటైందని పేర్కొన్నారు. సినిమా తన ‘బ్రెయిన్ చైల్డ్’ లేదా ‘ప్రొడక్ట్’ అయినప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం, డిఫెండ్ చేయడం, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం సహజమేనని ఆయన అన్నారు. సినిమా స్పోక్స్‌పర్సన్‌గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొంత ఓవర్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడాల్సి వస్తుందని తెలిపారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో తాను మాట్లాడే విధానం ఆధారంగా ప్రేక్షకులు సినిమా రిజల్ట్‌పై అంచనాలు పెంచుకుంటారని చెప్పారు.

మరోవైపు బాక్సాఫీస్ నంబర్ల ఇన్‌ఫ్లేషన్‌పై కూడా నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటివరకు ఏ ఫ్లాప్ సినిమాను హిట్ అని చెప్పలేదని, ఎప్పుడూ కావాలని కలెక్షన్ నంబర్లను పెంచి చెప్పలేదని స్పష్టం చేశారు. అయితే తెలుగు సినిమా మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే పోస్టర్‌పై చూపించే బాక్సాఫీస్ నంబర్లు వాస్తవానికి భిన్నంగా ఉండే పరిస్థితి ఉందని అన్నారు. ఒక సినిమా రూ.1 కోటి వసూలు చేసిందా, రూ.90 కోట్లు సాధించిందా అనేది ఎందుకు దాచాల్సిన అవసరం ఉందని నాగవంశీ ప్రశ్నించారు. అభిమానుల కోసం, సినిమా మార్కెటింగ్‌లో భాగంగా కలెక్షన్లను ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. బాక్సాఫీస్ నంబర్ల విషయంలో వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.