ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన నటన, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో నాగశౌర్య. వైవిద్యభరితమైన పాత్రలను ఎంచుకంటూ సినీరంగంలో తనకంటూ నాగశౌర్య పత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఛలో’ విజయం తర్వాత నాగశౌర్య కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఒకే జోనర్‌లో సినిమాలు చేయకుండా విభిన్న కథలతో రొటీన్‌కు భిన్నంగా సినిమాలను చేస్తున్నాడు. లేటెస్ట్‌గా నాగశౌర్య నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
అయితే ఈ సినిమా విడుదలకు డేట్లు దొరకని పరిస్థితి నెలకొందని సినీ పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తామని ఒకసారి.. మే 20న విడుదల చేస్తామని మరోసారి మేకర్స్ ప్రకటించారు. ముచ్చటగా మూడోసారి ఈ డేట్ కూడా రావడం లేదని వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూలైలో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఇప్పటి వరకు విడుదల కాకపోవడానికి డీఐ వర్క్ పెండింగ్‌లో ఉండటమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సాయి శ్రీరామ్ డీవోపీగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి సిట్టింగ్‌లో పాల్గొంటున్నాడట. అందుకే నాగశౌర్య మూవీ వర్క్ పెండింగ్‌లో పడిందని తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంతో చిత్ర యూనిట్‌కే తెలియాలి. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి నిర్మిస్తున్నారు.
