Site icon NTV Telugu

‘Naatho Nenu’: ‘బలగం’ వేణు బాటలో మెగాఫోన్ పట్టిన మరో ‘జబర్దస్త్’ నటుడు!

Nalo Nenu

Nalo Nenu

‘Balagam’ Venu:’జబర్దస్త్’ టీవీ షో తో పాపులర్ అయిన చాలామంది నటులు ఆ తర్వాత వెండితెరపై కూడా బోలెడన్ని అవకాశాలు అందుకున్నారు. కొందరైతే ఏకంగా హీరోలుగా నటిస్తున్నారు. మరికొందరు దర్శకుల అవతారం ఎత్తుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఆ ప్రయత్నాల్లో ఉండగా… అందులో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది మాత్రం ‘జబర్దస్త్’ వేణు నే! ‘బలగం’ మూవీతో ఒక్కసారిగా వేణు పేరు టాలీవుడ్ లో మారు మ్రోగిపోయింది. ‘దిల్’ రాజు పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో విడుదలైన ‘బలగం’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా… ఇప్పటికీ థియేటర్లలో జనం చూస్తూనే ఉన్నారు. అంతేకాదు, పల్లెటూరు మొత్తం ఒకచోట చేరి చూస్తున్న సినిమా కూడా ‘బలగమే’!
విశేషం ఏమంటే జబర్దస్త్ ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శాంతికుమార్ తుర్లపాటి కూడా దర్శకుడిగా మారారు! అతని దర్శకత్వంలో సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్ పుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా ప్రశాంత్ టంగుటూరి ‘నాతో నేను’ అనే సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు, ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌ ఇటీవల ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “టైటిల్‌ బావుంది. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీలా అనిపిస్తోంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం చక్కని విజయం సాధించాలి’’ అని ఆశీస్సులు అందించారు.
సాయికుమార్‌ మాట్లాడుతూ “మంచి కథతో శాంతికుమార్‌ ఈ చిత్రం చేస్తున్నారు. ఇందులో నేను భాగం కావడం ఆనందంగా ఉంది. మంచి కథకు మంచి మనిషి అయిన విజయేంద్ర ప్రసాద్‌గారు వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు శాంతికుమార్‌ మాట్లాడుతూ, “ఓ చక్కని కథ రాసుకుని, మొదట నిర్మాతల్ని వెతుక్కున్నాను. నా కథ నచ్చి వెంటనే వారు అంగీకరించారు. నా తొలి ప్రయత్నానికి సాయికుమార్‌ గారు అండగా ఉన్నారు. చక్కని సలహాలు సూచనలు అందిస్తున్నారు’’ అని అన్నారు. నిర్మాత ప్రశాంత్ మాట్లాడుతూ, “దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం. బిజీగా ఉండి కూడా మా ఆహ్వానం మేరకు విచ్చేసిన విజయేంద్రప్రసాద్‌ గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులకు మంచి సినిమా చూపించబోతున్నాం’’ అని అన్నారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సమీర్, సి.వి.ఎల్. నరసింహారావు, గౌతమ్ రాజు, ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సత్య కశ్యప్ స్వర రచన చేస్తుండగా, నేపథ్య సంగీతం ఎస్. చిన్న అందిస్తున్నారు.

Exit mobile version