ఈ ఏడాది మరో సౌత్ సెలెబ్రిటీ కపుల్ విడాకులతో అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇప్పటికీ టాలీవుడ్ లో చై, సామ్ విడాకుల విషయం గురించి ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సౌత్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న
డి ఇమ్మాన్ తాజాగా తన భార్యతో విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
దాదాపు 13 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత తన భార్య మోనికా రిచర్డ్ నుండి విడిపోతున్నట్లు వెల్లడించారు. రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘అన్నాత్తే’కు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన ఇమ్మాన్ 2008 ఏప్రిల్ లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాను వివాహం చేసుకున్నారు. అయితే వాస్తవానికి ఈ జంట 2020 నవంబర్ లో విడాకులు తీసుకున్నారు. కానీ ఆ విషయాన్నీ ఇమ్మాన్ ఇప్పుడే అధికారికంగా ప్రకటించారు.
ఇమ్మాన్ తన ప్రకటనలో “నా శ్రేయోభిలాషులు, సంగీత ప్రియులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జీవితం మమ్మల్ని విభిన్న మార్గాల్లో తీసుకెళ్తున్నప్పుడు, మోనికా రిచర్డ్, నేను నవంబర్ 2020 నాటికి పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాము. ఇకపై మేము భార్యాభర్తలు కాదు. మీడియాతో పాటు అందరూ మా ప్రైవసీకి భంగం కలిగించకుండా, జీవితంలో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మీ అవగాహన, ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అంటూ అసలు విషయాన్ని రివీల్ చేశారు. ఈ దంపతులకు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
