తెలుగు సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే ఆ కిక్కే వేరు. ఇప్పుడు అలాంటి ఓ ఊర మాస్ ఐటెం సాంగ్‌తో కుర్రకారును హుషారెత్తించడానికి వస్తున్నారు ‘ముగ్గురు కోతులు’. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ చిత్రం నుంచి తాజాగా ఓ అదిరిపోయే మాస్ నంబర్‌ను మేకర్స్ వదిలారు. విశేషం ఏంటంటే.. ఈ స్పెషల్ సాంగ్‌ను లెజెండరీ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ చేయడం విశేషం. పాటను రిలీజ్ చేసిన అనంతరం చిత్ర బృందానికి రాజేంద్ర ప్రసాద్ తన బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
‘కో కో కొకొరొకో’ అంటూ సాగే ఈ స్పెషల్ ఐటం సాంగ్ వింటుంటేనే మాస్ ఆడియన్స్ కు పూనకాలు వచ్చేలా ఉంది. గాయని లాస్య ప్రియ తన వాయిస్ తో పాడిన ఈ పాట ఇన్ స్టంట్ గా యూత్ కు ఎక్కేస్తోంది. జగదీష్ అందించిన క్యాచీ లిరిక్స్, సుహాస్ ఇచ్చిన మాస్ బాణీలతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సాంగ్ లో ముగ్గురు హీరోలతో కలిసి స్టెప్పులేసిన నటీమణి గ్లామర్, ఆమె అందాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని అర్థమవుతోంది. వినోద్, రఘు, సాయి మాస్టర్లు కంపోజ్ చేసిన ఈ ఊర మాస్ స్టెప్పులు సిల్వర్ స్క్రీన్ మీద బ్లాస్ట్ అవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది.
జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తోంది. రాజ్ నోముల సినిమాటోగ్రఫీ, జమీర్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. సాయి సతీష్, వినాయక రావు పీఆర్వోలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలతో క్యూరియాసిటీ పెంచేసిన ఈ ‘ముగ్గురు కోతులు’.. ఇప్పుడు ఈ స్పెషల్ ఐటెం సాంగ్ తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. మ్యూజికల్ ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్ర బృందం, మున్ముందు మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మొత్తానికి మాస్ ఆడియన్స్ కు కావాల్సిన ఫుల్ మీల్స్ ఈ సినిమాలో ఉన్నాయని తాజా పాటతో క్లారిటీ వచ్చేసింది!

