కారు రేస్, బైక్ రేస్ లపై చాలా సినిమాలు వచ్చాయి.. కానీ మొదటిసారి మడ్ రేస్ పై ఒక చిత్రం రాబోతోంది. నూతన దర్శకుడు డా. ప్రగాభల్ దర్శకత్వంలో యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మడ్డీ’.. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఉత్కటాను రేపుతూ థ్రిల్ కి గురి చేస్తోంది. బురద రేసులో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే హీరోలు.. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం సాగే రేస్, అందులో వారి కుటుంబాలు, మిగతావారు ఎలా నలిగిపోయారు అనేది చూపించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఇది జీప్ రేస్ అనడం కన్నా డెత్ రేస్ అని చూపించారు. ఇక జీప్ రేసులు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. భారదేశంలో మొదటిసారి బురదలో జీప్ రేసు ఒళ్ళు గగుర్పుడిచే స్థాయిలో తెరక్కించారు. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకోవడంతో తెలుగులోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 10 న విడుదలకు సిద్దమవుతుంది. మరి ఆ రోజు మిగతా సినిమాతో ఈ సినిమా పోటీపడి నిలుస్తుందో లేదో చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
