Game On: నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ సినిమా శ్రీరామనవమి కానుకగా విడుదలై బాక్సాఫీస్ బరిలో దడదడలాడిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ. 87 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వందకోట్ల క్లబ్ దిశగా సాగిపోతోంది. నాని, కీర్తి సురేశ్ ఆ యా పాత్రలలోకి పరకాయ ప్రవేశం చేయడంతో ఆడియెన్స్ ఓ సరికొత్త అనుభూతికి లోనవుతున్నారు. ఇదిలా ఉంటే… ‘దసరా’ మూవీ కారణంగా ‘గేమ్ ఆన్’ మూవీకి ఊహించని క్రేజ్ వచ్చేసింది. కారణం ఏమంటే… ‘దసరా’ మూవీతో పాటు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు.
‘గేమ్ ఆన్’ మూవీ గురించి దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ, ”మా అన్నయ్య గీతానంద్ హీరోగా, ’90 ఎం.ఎల్.’ ఫేమ్ నేహా సోలంకి హీరోయిన్ గా ఈ సినిమాను తెరకెక్కించాను. నిర్మాత రవి కస్తూరి నా థాట్ ను తెర మీద తీసుకురావడానికి ఎంతో సహకరించారు. ఈ సినిమాలో పాటలు, యాక్షన్ సీన్స్ మరో లెవల్ లో ఉంటాయి. ప్రతి ఫేమ్ రిచ్ గా ఉంటుంది. మేం ఎంత కష్టపడినా ప్రాడక్ట్ ఆడియెన్స్ ను రీచ్ కావాలంటే మంచి లాంచింగ్ ప్యాడ్ అవసరం. ‘దసరా’ సినిమా మాకు అలా ఉపయోగపడింది. ‘దసరా’తో పాటు థియేటర్లలో ప్రదర్శిస్తున్న మా మూవీ ట్రైలర్ కు సూపర్ రెస్సాన్స్ వచ్చింది. మా మూవీ రిలీజ్ ఎప్పుడు? అని చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అతి త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తాం. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘గేమ్ ఆన్’ ఉంటుందని హామీ ఇస్తున్నాం” అని అన్నారు. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరిటీ, ‘శుభలేఖ’ సుధాకర్ తదితరులు పోషించారు.