బీస్ట్ సినిమాతో కాస్త డిజప్పాయింట్ చేసిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, ఈసారి మాత్రం జైలర్ సినిమాతో గురి తప్పలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ ని మాస్ అవతారంలో చూపించి నెల్సన్ సాలిడ్ హిట్ కొట్టాడు. జైలర్ సినిమా థియేటర్స్ లో చూసిన ప్రతి రజినీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోని థియేటర్స్ నుంచి బయటకి వస్తున్నాడు. ఈ రేంజ్ సినిమాని రజినీ ఫాన్స్ ఈ మధ్య కాలంలో చూడలేదు. జైలర్ సినిమాకి కేరళ, కర్ణాటన రాష్ట్రాల్లో కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది, ఇందుకు కారణం మోహన్ లాల్-శివ రాజ్ కుమార్ లని నెల్సన్ పర్ఫెక్ట్ గా వాడుకోవడమే. పెద్ద హీరోల సినిమాల్లో గ్రాండియర్ కోసం ఇతర హీరోలతో క్యామియో ప్లే చేయిస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుంది, కొన్ని సార్లు అసలు ఈ క్యామియో ఎందుకు? అని ఆడియన్స్ కే అనిపించేలా చేస్తుంది.
ఈ విషయంలోనే నెల్సన్ పర్ఫెక్ట్ గా సక్సస్ అయ్యాడు. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్స్ ని క్యామియోలని గ్రాండియర్ కోసం వాడకుండా కథకి అవసరం అయిన చోట సూపర్బ్ గా వాడాడు. రజినీపైన ఉన్న అభిమానంతో జైలర్ సినిమాలో నటించడానికి మోహన్ లాల్-శివ రాజ్ కుమార్ ఒప్పుకోని ఉంటారు కానీ ఆ ఆబ్లిగేషన్ అనేది లేకపోయినా కూడా జైలర్ సినిమాకి ఈ ఇద్దరూ ఊహించని విధంగా హెల్ప్ అయ్యే పాత్రల్లోనే నటించారు. కనిపించేది కాసేపే అయినా మోహన్ లాల్-శివ రాజ్ కుమార్-రజినీకాంత్ సీన్స్ థియేటర్స్ లో గూస్ బంప్స్ తెస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఈ ముగ్గురికి సంబంధించిన ఒక సీన్ కి థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. స్టార్ హీరోలు క్యామియో చేయడానికి ఒప్పుకున్నప్పుడు… వాళ్లని ఈ రేంజులో వాడితే ఇదే రేంజ్ రిజల్ట్ వస్తుంది అని జైలర్ సినిమా నిరూపించింది.