గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో టికెట్ల రేటు విషయమై వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేటు తగ్గించిన తరుణంలో హీరో నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. థియటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణాకొట్టుకు ఎక్కువ ఆదాయం వస్తుంది అని నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నానితో పాటు హీరో సిద్దార్థ్ సైతం ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇక ఈ హీరోల వ్యాఖ్యలపై తాజాగా మంత్రి పేర్ని నాని స్పందించారు.
నేడు జరిగిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్ల సమావేశంలో మంత్రి నాని మాట్లాడుతూ” టాలీవుడ్‌పై జగన్ ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదు.. త్వరలోనే సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇక హీరో నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు చూశాడో నాకేం తెలుసు.. ఏ కొట్టు కలెక్షన్లు నాని దృష్టికి వచ్చాయో నాకు తెలియదు. మాట్లాడేవాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. కొన్ని థియేటర్లలో కనీసం ప్రమాణాలు పాటించడం లేదు. రెన్యూవల్ చేయకుండానే కొన్ని థియేటర్లను నడిపిస్తున్నారు. అందుకే జీవో చేసి వారిపై ఫైన్లు వేశాం” అని తెలిపారు. ప్రస్తుతం హీరో నానికి మంత్రి పేర్ని నాని వేసిన కౌంటర్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
