ఈ యేడాది అక్టోబర్ 13న దసరా కానుకగా రాజమౌళి మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కాబోతోంది. కాబట్టి ఈ లోగా స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలు థియేటర్లకు రావాల్సి ఉంటుంది. జూలై నెలాఖరులో థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఈ రెండు వారాల్లో 12 చిత్రాలు విడుదలైపోయాయి. ఈ వీకెండ్ లో మరో పది సినిమాలు వస్తున్నాయి. అలానే ఆగస్ట్ 19కి తమ చిత్రాలను విడుదల చేస్తామని ఇప్పటికే ముగ్గురు నిర్మాతలు ప్రకటించారు. వీటి సంఖ్య ఆరేడు వరకూ చేరొచ్చు. ఇవన్నీ స్మాల్ బడ్జెట్ చిత్రాలే. తెలంగాణాలోనూ, ఆంధ్రలోనూ ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోలేదు. చిన్న చిత్రాలకు ఈ మాత్రం థియేటర్లు చాలు. అయితే ‘టక్ జగదీశ్, లవ్ స్టోరీ’ వంటి సినిమాలకు ఇది చాలదు. నూరు శాతం ఆక్యుపెన్సీతో పాటు థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుంటేనే… ఓపెనింగ్స్ ను ఈ సినిమాలు సాధించగలవు. అప్పుడే ఇన్ని నెలల పాటు వేచి చూసినందుకు తగిన ప్రతిఫలం దక్కుతుంది.
అందుకే… ఆగస్ట్ నెలను వదిలేసి, ఏకంగా సెప్టెంబర్ మాసంలోనే ఈ మీడియం బడ్జెట్ చిత్రాలు జనం ముందుకు వస్తాయట. సెప్టెంబర్ 10న వినాయక చవితి. కాబట్టి ఆ నెల మొదటి మూడు శుక్రవారాల్లోనూ ఈ సినిమాలను విడుదల చేస్తారని అంటున్నారు. నాని నటిస్తున్న ‘టక్ జగదీశ్’ మూవీ ఓటీటీలోనే విడుదల కాబోతోందని ప్రకటన వచ్చినా… ఆ చిత్రాన్ని కూడా థియేటర్లలో విడుదల చేసే ఛాన్స్ లేకపోలేదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటిని దర్శక నిర్మాతలు ఖండించకపోవడంతో ఆ వార్తలకు బలం చేకూరుతోంది. ఇదిలా ఉంటే… నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’, గోపీచంద్ ‘సీటీమార్’, నాగశౌర్య ‘వరుడు కావలెను’ చిత్రాలను సెప్టెంబర్ లోనే విడుదల చేస్తారని తెలుస్తోంది. సో… వినాయక చవితికి థియేటర్లలో సందడే సందడి!