Carys: తాత ఏమో పేరు మోసిన నటుడు, తండ్రి కూడా ప్రఖ్యాతి గాంచిన నటుడు, తల్లి ఓ నాటి ప్రముఖ అందాలతార అయినప్పటికీ ఓ చిన్నది నటనకన్నా సంగీతం మిన్న అంటూ సాగుతోంది. ఇంతకూ ఎవరా భామ? ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు కిర్క్ డగ్లస్ మనవరాలు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ మైఖేల్ డగ్లస్ కూతురు, అందాల నటి కేథరిన్ జిటా జోన్స్ బిడ్డ! ఆమె పేరు కేరిస్ జిటా డగ్లస్. ఇరవై ఏళ్ళ కేరిస్ కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో అందరి చూపునూ తనవైపు తిప్పుకుంది. హాలీవుడ్ లో ప్రఖ్యాతిగాంచిన తన కన్నవారితో పాటు కేరిస్ కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కు హాజరయింది. తెలుపు రంగు గౌన్ వేసుకొని కేరిస్, రెడ్ కలర్ గౌనులో ఆమె తల్లి జిటా జోన్స్ ఇద్దరూ ప్రేక్షకులకు కనువిందు చేశారు. అయితే అందరి చూపు పరువాల పాప కేరిస్ పైనే ఎక్కువగా సాగింది. అమ్మాయిని చూడగానే ‘పాప భలేగుందిరో…’ అంటూ అనేకమంది కామెంట్స్ చేయడం విశేషం!
కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ఈ సారి గౌరవ పామ్ డి’ఆర్ అవార్డును మైఖేల్ డగ్లస్ అందుకోనున్నారు. మైఖేల్ కు నటి ఉమా తుమ్రన్ పామ్ డి’ఆర్ ను అందించనున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో కలసి కాన్స్ కు వచ్చింది కేరిస్. ఆమెను చూడగానే హాలీవుడ్ తారలాగే కనిపిస్తోంది. కానీ, కేరిస్ మనసు మాత్రం సంగీతంపైనే నెలకొందట! గాయనిగా ఆమె పాటకు ఫిదా అయిపోయేవారు ఎందరో ఉన్నారు. ఇన్ స్టాలో ఆమెకు ఇప్పటికే 1,95,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడే కనుక సినిమాల్లో నటిస్తే ఆ క్రేజే వేరుగా ఉంటుందబ్బా అనేవారూ లేకపోలేదు. ఎంతయినా మూడు తరాల అభినయరక్తం ఉన్న కుటుంబంలో పుట్టింది కదా, ఏదో ఒకరోజున హీరోయిన్ గా కేరిస్ అలరించే అవకాశముందని కొందరు భావిస్తున్నారు. మరి మైఖేల్, జిటాజోన్స్ కూతురు కేరిస్ జనానికి కనువిందు చేసే రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.