Chiranjeevi: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 60 ఏళ్ల మహిళకు ట్యాబ్‌లో ‘అడవి దొంగ’ సినిమా చూపిస్తూ వైద్యులు ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండా మహిళ మెదడులో కణతులు తొలగించారు. ఆపరేషన్ చేస్తున్న వైద్యులు మధ్యమధ్యలో మహిళతో మాటలు కలుపుతూ విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ వార్త శుక్రవారం నాడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తన పీఆర్వో ఆనంద్‌ను గాంధీ ఆస్పత్రికి పంపి మహిళ వివరాలను కనుక్కోవాలని సూచించారు. ఈ మేరకు మెగాస్టార్ పీఆర్వో ఆనంద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావును కలవగా.. ఆయన వైద్య సిబ్బందిని పరిచయం చేశారు. ఈ మేరకు వైద్య సిబ్బంది, మహిళతో పీఆర్వో ఆనంద్ మాట్లాడారు.
Read Also: Big Boss Season 6: బిగ్‌బాస్ హౌస్‌లోకి స్టార్ కపుల్.. అప్పుడు వరుణ్-వితికా జంట.. ఇప్పుడు..?
కాగా తాను మెగాస్టార్ చిరంజీవి అభిమానినని, ఆయన సినిమాలన్నీ చూస్తానంటూ పీఆర్వో ఆనంద్‌కు మహిళ వివరించింది. ఈ విషయాన్ని అక్కడి నుంచే ఫోన్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఆనంద్ చేరవేశారు. ఈ నేపథ్యంలో వీలు చూసుకుని రెండు, మూడు రోజుల్లో గాంధీ ఆస్పత్రికి వెళ్లి తనను అభిమానించే మహిళను కలుస్తానని చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పీఆర్వో ఆనంద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుకు తెలియజేశారు. తనను కలుస్తానని చిరంజీవి చెప్పడంతో సదరు మహిళ సంతోషం వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య లాంటి వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన గాఢ్ ఫాదర్ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 5న దసరా కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
